మహేష్ పై పూరి కామెంట్స్…. అభిమానులు ట్రోలింగ్

ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. హిట్ లో ఉంటేనే మహేష్ ఏ దర్శకుడికైనా అవకాశమిస్తాడని కామెంట్ చేయడంతో పాటు.. ఇప్పుడు తను హిట్ కొట్టాను కాబట్టి మహేష్ ఆఫర్ ఇస్తే సినిమా చేయనని, ఎందుకంటే తనకు కూడా ఓ క్యారెక్టర్ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పూరి జగన్నాధ్. దీంతో అతడిపై మహేష్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకుంటున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఇలా ట్రోలింగ్ కు గురవ్వడం పూరికి కొత్తేంకాదు. గతంలో చిరంజీవి విషయంలో కూడా ఇలానే తిట్లు తిన్నాడు పూరి జగన్నాధ్. గతంలో చిరంజీవితో ఆటోజానీ అనే ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు పూరి. కానీ ఆ సినిమా సెకెండాఫ్ చిరంజీవికి నచ్చలేదు. దీంతో ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యాడు.

అయితే తనకు చెప్పకుండా, తన ప్రాజెక్టు కాన్సిల్ చేసి, మరొకరికి ఛాన్స్ ఇవ్వడం తనకు నచ్చలేదని పూరి పత్రికాముఖంగా ప్రకటించాడు. నిజానికి ఇక్కడ మెగా కాంపౌండ్ ది ఎంత తప్పు ఉందో, ఇలా మీడియా ముందు రచ్చచేసి పూరి కూడా అంతే తప్పు చేశాడు. దీంతో మెగాభిమానులంతా మూకుమ్మడిగా పూరిపై విరుచుకుపడ్డారు. సెకండాఫ్ సరిగా రాయకపోతే సినిమా ఎలా ఓకే అవుతుందంటూ రెచ్చిపోయారు.

ఇది మాత్రమే కాదు, గతంలో పవన్ కల్యాణ్ విషయంలో కూడా ఇలానే జరిగింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన పూరి, పవన్ ను ఒప్పించాలంటే చాలా చిన్న విషయమని, సినిమాలో అతడి చేతిలో 2 గన్స్ ఉంటాయని చెబితే కథ కూడా వినకుండా ఓకే చెప్పాస్తాడని కామెంట్ చేశాడు. నిజానికి పూరి ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినప్పటికీ అప్పట్లో అవి పెనుదుమారమే రేపాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు పూరి.

ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ దృష్టిలో దోషిగా మారాడు పూరి జగన్నాధ్. నిజానికి పూరిపై మహేష్ ఫ్యాన్స్ కు చాలా అభిమానg ఉండేది. తమ హీరోకు పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా మహేష్ ఫ్యాన్స్ అతడ్ని ఎప్పుడూ లైక్ చేస్తారు. మహేష్ తో జనగణమన ప్రాజెక్టు ఎప్పుడొస్తుందంటూ అడుగుతూ ఉంటారు. ఇలాంటి టైమ్ లో పూరి చేసిన కామెంట్స్, అతడికి మహేష్ తో, అతడి ఫ్యాన్స్ తో పూర్తిగా కనెక్షన్ కట్ అయ్యేలా చేసింది.