కొత్త తేదీ వచ్చింది.. అయినా అనుమానమే!

సాహో సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. గ్రాఫిక్స్ కారణంగా సినిమా కాస్త డిలే అవుతుందని ప్రకటించిన మేకర్స్.. అన్ని పనులు పూర్తిచేసుకొని ఆగస్ట్ 30న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు.

అయితే నిర్మాతలైతే అధికారికంగా తేదీ ప్రకటించినప్పటికీ సినీజనాలు మాత్రం ఈ విషయాన్ని నమ్మడం లేదు. మరీముఖ్యంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ను దగ్గరుండి పరిశీస్తున్న కొందరు వ్యక్తులు.. ఆగస్ట్ 30పై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సాహో సినిమాకు సంబంధించి 2 వారాల గడువు సరిపోదనేది చాలామంది అభిప్రాయం. పోనీ ఇదొక్కటే పెండింగ్ అనుకుంటే అది కూడా కాదు. గ్రాఫిక్స్ తో పాటు సెకెండాఫ్ ఎడిటింగ్, డీఐ వర్క్ కూడా పెండింగ్ లో ఉంది. ఇవన్నీ 3 వారాల్లో పూర్తయ్యే వ్యవహారం కాదంటున్నారు సినిమా వర్క్ తెలిసినవాళ్లు.

అయితే మేకర్స్ మాత్రం అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. గ్రాఫిక్ డిజైనర్లు, ఎడిటర్లు, డీఐ టెక్నీషియన్స్ తో చర్చించిన తర్వాతే సినిమాను 2 వారాలు పోస్ట్ పోన్ చేశామని.. ఈ సమయం తమకు సరిపోతుందని వాళ్లు చెప్పారని మేకర్స్ అంటున్నారు.

మరి నిర్మాతలు చెబుతున్నట్టు సాహో సినిమా ఆగస్ట్ 30కి వస్తుందా.. లేక కొంతమంది భయపడుతున్నట్టు ఆగస్ట్ 30 నుంచి కూడా ఈ సినిమా వాయిదా పడుతుందా అనేది చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం. సాహో మరోసారి వాయిదాపడితే ఈసారి దాని ప్రభావం సైరాపై తప్పకుండా పడుతుంది.