ఇన్నాళ్లకు నిర్మాతల కష్టాలు తెలిసొచ్చాయి

మొన్నటివరకు తన పార్ట్ పూర్తిచేసి ఇంటికెళ్లిపోయేవాడు సందీప్ కిషన్. ప్రమోషన్స్ లో తన వంతు పాత్ర పోషించేవాడు. ఎప్పుడైతే తనే నిర్మాతగా మారి సినిమా నిర్మించాడో, అప్పుడు అసలు కష్టాలు తెలిసొచ్చాయి ఈ హీరోకి.

సందీప్ కిషన్ నటించి, నిర్మించిన నిను వీడని నీడను నేనే సినిమా విడుదలై ఇప్పటికే వారం రోజులు దాటింది. సాధారణంగా వారం దాటిన తర్వాత సినిమాలకు ప్రచారం ఇవ్వరు. ఆల్రెడీ మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తాయి. కానీ సందీప్ కిషన్ మాత్రం ఇంకా తన సినిమాను వదల్లేదు. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు సినిమాకు ప్రమోషన్ ఇస్తూనే ఉన్నాడు.

వివిధ పట్టణాల్లో పర్యటించడంతో పాటు సక్సెస్ మీట్, థ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్, ఇంటర్వ్యూలు, టెక్నీషియన్స్ తో చిట్ చాట్… ఇలా రోజుకో కార్యక్రమం ఏర్పాటుచేస్తూనే ఉన్నాడు. ఇవి కాకుండా థియేటర్లలో టిక్కెట్ అమ్మే పని చేయడం, విశాఖ బీచ్ లో సైకిల్ తొక్కడం, ప్రజలతో కలిసి రెస్టారెంట్లలో భోజనాలు చేయడం, మెట్రో రైల్ లో ప్రయాణం.. ఇలా చాలా హంగామా చేస్తున్నాడు.

ప్రచారం విషయంలో హీరోగా సందీప్ ఎప్పుడూ ఇంత కష్టపడలేదు. ఇప్పుడు నిర్మాత కూడా తనే కావడంతో ఇంత కష్టపడాల్సి వస్తోంది. పైగా ఇస్మార్ట్ శంకర్ ప్రభావం ఈ హీరో సినిమాపై గట్టిగా పడింది. అందుకే ఇలా తీరికలేకుండా ప్రచారం చేస్తున్నాడు. ఆల్రెడీ బ్రేక్ఈవెన్ అయిన ఈ సినిమాకు సందీప్ ఇంకెన్ని రోజులు ఇలా ప్రచారం చేస్తాడో చూడాలి.