ఆఫ్రికా కప్ సాకర్ విజేత అల్జీరియా

  • ఫైనల్లో సెనెగల్ పై 1-0తో గెలుపు
  • ఆఫ్రికాదేశాల సాకర్ సందడికి తెర

2019 ఆఫ్ర్రికా నేషన్స్ సాకర్ కప్ ను అల్జీరియా రెండోసారి గెలుచుకొంది. ఈజిప్టులోని వివిధ నగరాలు వేదికగా గత కొద్ది వారాలుగా జరిగిన ఈ సాకర్ సంరంభంలో మొత్తం 24 దేశాల జట్లు తలపడితే అల్జీరియా, సెనెగల్ జట్లు మాత్రమే టైటిల్ సమరానికి అర్హత సాధించగలిగాయి.

కైరోలోని ఇంటర్నేషనల్ సాకర్ స్టేడియం వేదికగా ముగిసిన హోరాహోరీగా సాగిన ఫైనల్లో…. అల్జీరియా 1-0 గోల్ తో విజేతగా నిలిచింది.

ఆట ప్రారంభమైన రెండో నిముషంలోనే బాగ్దాద్ బాన్ డేగో సాధించిన గోల్ తో అల్జీరియా 1-0 తో పైచేయి సాధించింది. ఆ తర్వాత నుంచి సెనెగల్ జట్టు ఎదురుదాడులతో ఈక్వలైజర్ కోసం పోరాడినా ఫలితం లేకపోయింది.

సెనెగల్ కు చేజారిన టైటిల్…

2002 లో తొలిసారిగా ఆఫ్ర్రికాకప్ ఫైనల్స్ చేరిన సెనెగల్ జట్టు..అప్పటి ఫైనల్లో కామెరూన్ చేతిలో ఓటమి పొంది రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొంది.

ఆ తర్వాత 17 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఫైనల్ చేరినా టైటిల్ సమరంలో నిరాశ తప్పలేదు. అల్జీరియా చేతిలో ఓటమితో
మరోసారి రన్నరప్ స్థానంలో మిగలక తప్పలేదు.

అల్జీరియా ఆఫ్రికాకప్ విజయంతో…రాజధాని అల్జీర్స్ లోని అభిమానులు సంబరాలు జరుపుకొన్నారు.