విండీస్ టూర్ కు భారతజట్టు ఎంపిక నేడే

  • యువక్రికెటర్ల వైపే సెలెక్టర్ల చూపు
  • సెలెక్షన్ కమిటీ సమావేశంలో కొహ్లీ

వెస్టిండీస్ తో జరిగే తీన్మార్ వన్డే,టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్టును ఎంపిక చేయటానికి..చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ..ముంబైలో ఈ రోజు సమావేశం కానుంది.

కరీబియన్ టూర్ కు తాను అందుబాటులో ఉండబోనంటూ ధోనీ స్వయంగా ప్రకటించడంతో…ఐదుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీకి తలనొప్పి తగ్గినట్లయ్యింది.

కెప్టెన్ కొహ్లీ సాక్షిగా….

ఐదుగురు సభ్యుల ఎంపిక సంఘంతో పాటు…కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం…పాల్గోనున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలోనూ కొహ్లీనే భారతజట్లకు నాయకత్వం వహించడం ఖాయంగా కనిపిస్తోంది.

2023 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని..ఎక్కువమంది యువఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.

టాపార్డర్లో మయాంక్ అగర్వాల్, శుభ్ మాన్ గిల్, మనీష్ పాండే, మిడిలార్డర్లో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, పేస్ విభాగంలో నవదీప్ సైనీ, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ కు అవకాశం ఇవ్వనున్నారు.

స్పిన్ విభాగంలో…కుల్దీప్ యాదవ్ ను తప్పించడంతో పాటు…లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ కు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఎంపిక సంఘం ఉంది.

రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్,శ్రేయస్ గోపాల్ లకు అవకాశం ఇవ్వనున్నారు.

యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ల గురించి సైతం ఎంపిక సంఘం సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదు.

ఆగస్టు 3 నుంచి టీ-20 సిరీస్ 

వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్, 8వ ర్యాంకర్ విండీస్ జట్ల మధ్య తీన్మార్ వన్డే సిరీస్ ఆగస్టు 3 నుంచి 6 వరకూ టీ-20 సిరీస్ ,
ఆగస్టు 8 నుంచి 14 వరకూ మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ నిర్వహిస్తారు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ సమరంలో భాగంగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 3 వరకూ రెండుమ్యాచ్ ల సిరీస్ జరుగనుంది.

మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా భారతజట్టు గత దశాబ్దకాలంలో కరీబియన్ ద్వీపాల పర్యటనకు వెళ్ళనుండటం ఇదే మొదటిసారి.