బీజేపీలోకి వీ6 వివేక్… కుదిరిన ముహూర్తం !

వీ 6 చానెల్ అధినేత‌, పెద్ద‌ప‌ల్లి మాజీ ఎంపీ వివేక్ పార్టీమార‌డం ఖాయ‌మైంది. ఎంపీ ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయ‌న‌… ఇన్నాళ్లు ఏ పార్టీలో చేర‌లేదు. కాంగ్రెస్‌లో చేర‌తార‌ని ప్ర‌చారం జరిగింది. కానీ ఆయ‌న బీజేపీలో చేర‌డం ఖాయ‌మైంది. మంగ‌ళ‌వారం ఉద‌యం అమిత్‌షా స‌మ‌క్షంలో వివేక్ బీజేపీలో చేర‌నున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్ప‌ట్లో లేచేలా క‌న‌ప‌డ‌డం లేదు. బీజేపీ మ‌రో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. అలాగే బీజేపీకి కూడా ఓ ద‌ళిత నేత కావాలి. వివేక్‌కు చాన‌ల్ ఉంది. వెలుగు పేప‌ర్ కూడా ఉంది. అంతేకాకుండా పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో వివేక్‌కు కేడ‌ర్ ఉంది. ఇటీవ‌ల జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో కొంత‌మేర ప్ర‌భావం చూపారు.

రామ‌గుండం మాజీ ఎమ్మెల్యే సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ ఇటీవ‌లే బీజేపీలో చేరారు. ఆయ‌న‌కు వివేక్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. వివేక్ ప్రోద్బలంతోనే సోమార‌పు పార్టీ మారార‌ని తెలుస్తోంది.

టీఆర్ఎస్‌కు దూర‌మైన త‌ర్వాత వివేక్ కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు, అయితే ఈ మ‌ధ్య‌నే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించ‌డం మొద‌లుపెట్టారు. స‌చివాల‌యం త‌ర‌లింపుపై రౌండ్ టేబుల్ స‌మావేశం పెట్టారు. వివిధ ప‌క్షాల‌ను ఆహ్వానించి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్మానాలు చేశారు .

మొత్తానికి తెలంగాణ‌లో పాగా కోసం బీజేపీ పావులు క‌దుపుతోంది. రాబోయే రోజుల్లో ముఖ్య‌మైన నేత‌లను చేర్చుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మున్సిపాల్టీ ప‌రిధిలో జెండా ఎగుర‌వేసేందుకు ఇప్ప‌టికే స్కెచ్‌లు గీస్తోంది. క‌రీంనగ‌ర్‌లో కాంగ్రెస్ కీల‌క నేత‌గా ఉన్న న‌రేంద‌ర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వాన్ని కూడా అట్రాక్ట్ చేసే ప‌నిలో బీజేపీ ప‌డింది.