‘ఇస్మార్ట్ శంకర్’ కథ నాదే అంటున్న హీరో

‘ఆనందం’ ఫేమ్ ఆకాష్ టాలీవుడ్ లో మరుగున పడిపోయిన హీరోలలో ఒకరు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇతను ఇప్పుడు తాజాగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పై ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కాడు.

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ తాజాగా రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది తాను వ్రాసుకున్న కథ అంటూ ఆకాష్ ఆరోపిస్తున్నాడు.

ఇదే కథను తెలుగు, తమిళ భాషల్లో తాను రాసుకున్నానని, తనే హీరోగా రాధ అనే మహిళా దర్శకులు ఒక సినిమా కూడా తీశారని, ఆ సినిమా ఇప్పటికే ‘నాన్ యార్’ అనే టైటిల్ తో విడుదల కాగా తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ అనే టైటిల్ తో త్వరలో విడుదల కాబోతోందని, ఈలోపు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తమ కి షాక్ తగిలిందంటూ ఆకాష్ ఆవేదన వెళ్లగక్కాడు.

అయితే ఈ విషయంలో పూరి జగన్నాథ్ ని సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని, అందుకే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసి పరిష్కారం కోసం మీడియాను కూడా ఆశ్రయించామని పేర్కొన్నాడు. దీని తాలూకా ఆధారాలను సైతం మీడియా ముందు పెట్టాడు ఆకాష్. మరి ఈ విషయంలో పూరి జగన్నాథ్ ఏం చేస్తారో చూడాలి.