రికార్డు సృష్టించిన సమంత

స్టార్ హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ అనేది సాధారణ విషయంగా మారింది. కానీ హీరోయిన్లు నటించిన సినిమాలకు మిలియన్ డాలర్ వసూళ్లంటే అది చెప్పుకోదగ్గ విషయం. అలాంటి ఘనతనే సాధించింది సమంత. ఆమె నటించిన ఓ బేబీ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.

ఈనెల 5న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయింది. సమంత యాక్టింగ్ తో పాటు స్టోరీలైన్ క్లిక్ అవ్వడంతో సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అదే సమయంలో ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే దీనికి 10లక్షల డాలర్ల వసూళ్లు వస్తాయని మాత్రం యూనిట్ ఆశించలేదు. విడుదలైన ఇన్ని రోజులకు ఈ సినిమా ఈ ఘనత సాధించింది.

ఈ సినిమాకు మిలియన్ డాలర్ వసూళ్లు రావడంతో ప్రస్తుతం యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి సినిమాకు ప్రచారం కల్పించాలని భావిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనకు సురేష్ బాబు నో చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమా రన్ దాదాపు పూర్తయింది. ఇలాంటి సమయంలో మరోసారి ప్రచారం కల్పించడం వల్ల ఉపయోగం ఉండదనేది సురేష్ బాబు అభిప్రాయం. పైగా సమంత కూడా ఈ సినిమాను పక్కనపెట్టి, 96 రీమేక్ పై దృష్టిపెట్టింది.