బాక్సింగ్ రింగ్ లో మరో విషాదం

  • పోరాడుతూ మృతి చెందిన రష్యన్ బాక్సర్

క్షణాలలో కోట్ల రూపాయలు ఆర్జించే బాక్సర్ల ప్రాణాలూ గాలిబుడగల్లాంటివేనని మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చింది.

అభిమానులను అలరింప చేయటంతో పాటు… నిముషాలలో కోట్ల రూపాయలు ఆర్జించే వీలున్న ప్రొఫషనల్ బాక్సింగ్ లో హెల్మెంట్లు ధరించకుండా బాక్సర్లు పోరాడుతూ ఉంటారు.

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పంచ్ లు విసురుకొంటూ… ముక్కూమొకం ఏకమయ్యేటట్లు ముష్టిఘాతాలు విసురుకోడం, రక్తం చిందేలా… మెదడు నరాలు చిట్లేలా పరస్పరం బాదుకోడం ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మనకు కనిపిస్తుంది.

మహ్మద్ అలీ, జో ఫ్రేజర్, మైక్ టైసన్, ఇవాండర్ హోలీఫీల్డ్, మే వెదర్ లాంటి ఫ్రొఫెషనల్ బాక్సర్లు భీకరపోరాటాలు చేసి భారీగా దెబ్బలు తిన్నా… ప్రాణాలతో బయటపడినవారే.

అయితే… బాక్సింగ్ రింగ్ లో పోరాడుతూ గాయాలతో కన్నుమూసిన బాక్సర్లు చాలమందే ఉన్నారు. ఆ జాబితాలో తాజాగా రష్యన్ బాక్సర్, 28 ఏళ్ల మాక్సిమ్ దడషేవ్ చేరాడు.

అమెరికాలోని మేరీల్యాండ్ ఆక్సెన్ హిల్స్ థియోటర్ వేదికగా జరిగిన వెల్టర్ వెయిట్ ఫైట్ లో సుబ్రిల్ మథయాస్ తో మాక్సిమ్ 13 రౌండ్లపాటు పోరాడాడు.

11వ రౌండ్ ముగిసే సమయానికే మాక్సిమ్ తలకు బలమైన గాయాలయ్యాయి. ట్రెయినర్ వద్దని వారించినా మాక్సిమ్ వినకుండా… 12, 13 రౌండ్లలోనూ తన పోరాటం కొనసాగించి… ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు.

తలపై తగిలిన దెబ్బలతో మెదడునరాలు చిట్లాయని..28 ఏళ్ల మాక్సిమ్ మరణానికి బాక్సింగ్ ఫైటే కారణమని రష్యన్ బాక్సింగ్ సమాఖ్య ప్రకటించింది.