ఆర్థిక ఇబ్బందులు…. కుటుంబం ఆత్మహత్యాయత్నం

అతను ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో సజావుగా కాపురం సాగుతోంది. కాని ఉన్న ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టాయి. వాటికి చావే పరిష్కారం అనుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. భార్య, కొడుకు మృతి చెందగా.. అతను మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే….

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పారేపల్లి లోకేశ్వర్, చిత్రకళ (37) దంపతులు సంతోష్ నగర్ కాలనీలో నివసిస్తున్నారు. వారికి లోహిత్ కుమార్ (12), శ్రీ విఘ్నేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లోకేశ్వర్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. కాగా, వ్యక్తిగత కారణాలతో ఆరు నెలల క్రితం అతను ఉద్యోగం మానేశాడు.

ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. రానురానూ ఆర్థిక సమస్యలు పెరిగిపోవడంతో గత రాత్రి లోకేశ్వర్ తన భార్య చిత్రకళ, కొడుకు లోహిత్‌ కుమార్‌తో కలిసి పురుగుల మందు తాగారు. దీంతో చిత్రకళ, లోహిత్ అక్కడికక్కడే మరణించారు.

కాగా, అపస్మారక స్థితిలో ఉన్న లోకేశ్వర్ హైదరాబాద్‌లోని తన సోదరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆమె వెంటనే లోకేశ్వర్ ఇంటి దగ్గర్లో ఉన్న వారికి ఫోన్ చేసి చెప్పింది. వెంటనే వాళ్లు వెళ్లి తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు మృతి చెంది.. లోకేశ్వర్ అపస్మారక స్థితిలో ఉండటం గమనించారు.

వెంటనే లోకేశ్వర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. లోకేశ్వర్ కోలుకుంటే గాని అసలు ఏం జరిగిందనే విషయం తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.