పెన్సిల్ పార్థసారథి గా మారిన న్యాచురల్ స్టార్

ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తో కలిసి ‘గ్యాంగ్ లీడర్’ అనే ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

లక్ష్మీ మరియు శరణ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో కథ ఎలా ఉండబోతోందో హింట్ ఇస్తోంది.

టీజర్ చూస్తే నాని ఈ సినిమాలో పెన్సిల్ పార్థసారథి అనే రివెంజ్ రైటర్ గా కనిపిస్తాడు. అప్పుడే అతని జీవితం లోకి ఐదుగురు ఆడవాళ్లు వస్తారు. వాళ్ళేం చేశారు? వారికి నాని తో ఏం పని? టీజర్ చూస్తే సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పచ్చు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 30 వ తారీఖున విడుదల కాబోతోంది. ‘జెర్సీ’ సినిమాకి మంచి సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.