Telugu Global
NEWS

రవాణా శాఖలో కోట్ల రూపాయల స్కామ్‌లను వెలికితీసిన కమిషనర్‌

రవాణా శాఖలో అవినీతిని అంతమొందించేలా సంస్కరణలు తీసుకువద్దామని ప్రయత్నించిన రవాణా శాఖ కమిషనర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయులుకు కళ్ళు బైర్లు కమ్మేలా స్కామ్ లు దర్శనమిచ్చాయి. ఒక స్కామ్ అంతుతేలుద్దామని మొదలుపెడితే… మరో స్కామ్… అలా స్కామ్ ల వెంట స్కామ్ లు బయటపడడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపి ఆర్టీఏ డిపార్ట్‌మెంట్ లో సంస్కరణలు చేపట్టాలనుకుంటున్న ఉన్నతాధికారులకు తనిఖీలకు వెళ్లిన కొద్దీ గత సర్కారు హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం […]

రవాణా శాఖలో కోట్ల రూపాయల స్కామ్‌లను వెలికితీసిన కమిషనర్‌
X

రవాణా శాఖలో అవినీతిని అంతమొందించేలా సంస్కరణలు తీసుకువద్దామని ప్రయత్నించిన రవాణా శాఖ కమిషనర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయులుకు కళ్ళు బైర్లు కమ్మేలా స్కామ్ లు దర్శనమిచ్చాయి. ఒక స్కామ్ అంతుతేలుద్దామని మొదలుపెడితే… మరో స్కామ్… అలా స్కామ్ ల వెంట స్కామ్ లు బయటపడడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఏపి ఆర్టీఏ డిపార్ట్‌మెంట్ లో సంస్కరణలు చేపట్టాలనుకుంటున్న ఉన్నతాధికారులకు తనిఖీలకు వెళ్లిన కొద్దీ గత సర్కారు హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ను అడ్డంగా దోచుకున్న విధానం తెలుసుకున్న అధికారులు విస్తుబోతున్నారట.

వాహనాల లైఫ్ టాక్స్ ఎగవేత, ఉచిత ఎల్ఎల్ఆర్ పేరుతో వసూళ్ళు, డీలర్ల దోపిడీ, ఏజెంట్ల కక్కుర్తి, నకిలీ ఇన్ వాయిస్ లతో కోట్ల రూపాయల దోపిడీ, అయిన వాళ్లకు దోచిపెట్టడంతో రికవరీకి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు వేస్తూ తాట తీయడానికి సిద్ధమవుతున్నారు..

గత ప్రభుత్వం హయాం లో ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ గా వున్న. బాలసుబ్రహ్మణ్యం స్థానం‌లో వచ్చిన ఐపీఎస్ అధికారి పీ.సీతారామాంజినేయులు తన బృందాలతో డిపార్ట్‌మెంట్ లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పీ.ఎస్.ఆర్. బృందం తనిఖీల్లో అవాక్కయే స్కాం లు బయటపడుతున్నాయి. రాష్ట్రం లో విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలలో దాదాపు 46 మోటార్ వాహనాల షో రూం లపై రవాణా శాఖ అధికారులు జరిపిన మెరుపుదాడుల్లో నమ్మలేని ‌నిజాలు బయటపడ్దాయి.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లో అవకతవకలు…

రవాణా శాఖలో కీలకమైన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియలో కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని అధారాలతో సహా వెలికి తీసారు.

విజయవాడ లో 19మంది డీలర్లు, విశాఖపట్నంలో 22మంది, అనంతపురంలో 5గురు డీలర్ల గుప్పిట్లో రాష్ట్ర రవాణా శాఖ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విభాగం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

కోట్లాది రూపాయల ట్యాక్స్ ఎగవేత…

వాహనాలను 50-60 వేల రూపాయలకు అమ్మినట్టు ఇన్ వాయిస్ లు తయారు చేసి.. రాష్ట్ర రవాణా శాఖ కు చెల్లించాల్సిన బీమా పన్నులను ఎగవేసినట్టుగా అధికారుల సోదాల్లో బట్టబయలు అయింది.

అనంతపురం జిల్లాలో ఒకడీలర్ ఏకంగా 18 లక్షల రూపాయలు స్వాహా చేసినట్టు బట్టబయలు కావడం తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వున్న డీలర్లు దాదాపు 250-300 కోట్ల రూపాయలు బీమా టాక్స్ చెల్లించకుండా ఆర్టీఏ ఖజానాకు సున్నం‌ పూశారని అధికారుల దాడుల్లో తేలింది.

ఆన్ లైన్ వ్యవస్థలోని కొందరు ఉద్యోగులు డీలర్లతో కుమ్మకై తమ శాఖకు రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టించడం పై డీలర్ల తో దోస్తీ చేసిన ఉద్యోగులపై యాక్షన్ కి సిద్దమవుతున్నారు రవాణా శాఖ కమీషనర్ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు.

రవాణా శాఖలో జరిగిన అవినీతి దందాను అధారాలతో సహా సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పటికే నివేదిక అందచేసిన కమీషనర్ ఇంటి దొంగల జాబితాని రెడీ చేస్తున్నారు. ఇక ఏపి వ్యాప్తంగా అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ AP 39 పేరుతో జరిగిన దోపిడీ లో గత ప్రభుత్వం లోని పెద్దల హస్తం వుండటం తో వారి పాత్ర పై ఆధారాలు సేకరిస్తున్నారు.

ఫ్యాన్సీ నెంబర్ల ఆదాయానికి గండి…

AP 39 సిరీస్ వల్ల రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు ఒకే నంబర్ వుండటం‌ వల్ల ఏ వాహనం రిజిస్ట్రేషన్ ఏ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో జరిగిందో తెలియని గందరగోళం రవాణా శాఖ లో నెలకొంది. ఈ విధానం ప్రారంభించిన ఆరునెలల్లోనే రవాణా శాఖకు ఏడుకోట్ల రూపాయలు నష్టం వచ్చిందని నిర్ధారించారు అధికారులు.

గతంలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ముఖ్యమైన నంబర్లకు, ఫ్యాన్సీ నంబర్లకు వేలం పాట ద్వారా ఆర్టీఏ శాఖకు లక్షల్లో ఆదాయ౦ వచ్చేది… అయితే AP 39 సిరీస్ విధానం వల్ల డిమాండ్ వున్న వాహనాల నంబర్ ను ఇప్పుడు ఉచితంగా ఇచ్చేస్తున్నారు అధికారులు.

స్వైపింగ్ లో స్వాహా….

దీని వల్ల గత ఆరునెలల్లో సంస్థకు కోట్ల రూపాయలలో కన్నం పడిందని రవాణా శాఖ కమీషనర్ ఆంజనేయులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఐదేళ్ల కాలం లో స్వైపింగ్ మిషన్ల ద్వారా చేసిన లావాదేవీలకు ఇప్పుడు లెక్క తేలకపోవడంతో దాదాపు నలభై కోట్ల రూపాయల గోల్మాల్ పై విచారణ కు సిద్దమవుతున్నారు కమీషనర్.

పయ్యావుల కేశవ్ చేతి వాటం….

ఇక ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకున్ని అనంతపురం జిల్లాకు చెందిన టీడిపి నేత , ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ రవాణా శాఖ లో ఎల్ఎల్ఆర్ మేళాల పేరిట 30 వేలమందికి ఉచితంగా లైసెన్సు లు ఇప్పించారు… అప్పటి ఆర్టీఏ. కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం తో లోపాయికారిగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొదట ఉచితంగా ఎల్ఎల్ఆర్ అని చెప్పి.. తర్వాత మేళా ముగిసిన తర్వాత ముప్పై వేల ఎల్ఎల్ఆర్ లకు తాను ఖర్చు పెట్టానని దీనికి పెద్దమొత్తం లో ఖర్చు అయ్యిందని తెలుగు దేశం ప్రభుత్వం హయామ్ లో డబ్బులు మెత్తం వసూలు చేసాడు. ఓ వైపు ప్రజలకు ఉచితంగా సర్వీస్ అంటూనే ప్రభుత్వం దగ్గర బిల్లులు వసూళ్లు చేసుకున్న కుంభకోణం ఇప్పుడు రవాణా శాఖలో సంచలనంగా మారింది. దీనిపై ఎంత మొత్తం చేతులు మారిందన్న దానిపై ఆర్థిక శాఖ అధికారుల వద్ద సాక్ష్యాలు సేకరిస్తున్నారు రవాణా శాఖ కమీషనర్ ఆంజనేయులు.

రవాణా శాఖ లో సంస్కరణల పేరిట జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టిన రవాణా శాఖ కమీషనర్ తదుపరి చర్యలపై సీఎం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయవనరుల్లో ఒకటైన రవాణా శాఖ లో కోట్ల రూపాయలు స్కాం లు బయటపడుతుండడంతో, ఇంకా లోతుగా విచారణ చేస్తే ఇంకెన్ని స్కాం లు బయట పడుతాయో అని అవినీతి అధికారులు భయపడుతున్నారు.

First Published:  24 July 2019 5:19 AM GMT
Next Story