జగన్ పందేరం.. అదృష్టవంతులు వీళ్లే

జగన్ కేబినెట్ విస్తరణలో చాలా మంది సీనియర్లకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి మంత్రి పదవులు దక్కలేదు. సామాజిక కోణంలో కొత్త వారు మంత్రులైపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే ఇప్పుడు వారందరికీ న్యాయం చేయడానికి జగన్ సిద్ధమైనట్లు తెలిసింది. జగన్ తాజాగా అసెంబ్లీలో వివిధ నామినేటెడ్ పదవులను 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చేలా…. అందులో 50శాతం మహిళలకు కేటాయించేలా పదవుల ప్రకటన చేశారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రతిపక్ష టీడీపీకి వెళ్లనుంది. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ పైసాను ఈ కమిటీ లెక్కించనుంది. ఈ పోస్టుకు టీడీపీ అధినేత చంద్రబాబు అచ్చెన్నాయుడు పేరును ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.

ఇక ఇందులో 8మంది సభ్యులను అధికార వైసీపీ నుంచి నియమించాలి. దీంతో ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలకు పదవులు దక్కనున్నాయి. ఇక అసెంబ్లీలో 10 కమిటీలు వేయాల్సి ఉంటుంది. జగన్…. ఈ పదవుల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలకు న్యాయం చేయాలని కసరత్తు చేస్తున్నట్టు సమచారం.

వైసీపీలో కీలక సీనియర్లు గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, ఆనం రామానారాయణ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ప్రసాద్ రాజు, రాజన్న దొర, కళావతి, బాబూ రావు, బాలరాజు, వీరభద్రస్వామిలకు దాదాపు నామినేటెడ్ పదవులు ఖాయమన్న ప్రచారం వైసీపీలో సాగుతోంది. ఇక మహిళా ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా పదవులు లభిస్తాయంటున్నారు.