మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్ టికెట్లు ఇవ్వ‌నున్న ఢిల్లీ ప్ర‌భుత్వం

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (డీటీసీ), క్ల‌స్ట‌ర్ స్కీం బ‌స్‌ల‌లో మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణించ‌డానికి టికెట్ల‌ను జారీచేసే అంశానికి ఢిల్లీ కాబినెట్ త్వ‌ర‌లోనే ఆమోదం తెల‌ప‌నున్న‌ది.

ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఇచ్చే గులాబి రంగులో ఉండే టికెట్‌కి ప‌దిరూపాయ‌లు ఆయా ట్రాన్స్‌పోర్టు ఆప‌రేట‌ర్ల‌కు చెల్లిస్తుంది. ఒక‌సారి ఆ టికెట్‌తో బ‌స్ ఎక్కితే దూరంతో సంబంధం లేకుండా ఏ స్టాపులో నైనా దిగ‌వ‌చ్చు.

ఢిల్లీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం ”ఒక కాబినెట్ నోట్ దీనికి సంబంధించి సిద్ధ‌మ‌యింది. దాన్ని ఇప్ప‌టికే న్యాయ‌, ఆర్థిక శాఖ‌ల‌కు పంపించ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లోనే ఆమోదం కోసం కాబినెట్ ముందుకు వ‌స్తుంది” అని వారు తెలియ‌జేశారు.

ఢిల్లీ మెట్రో రైళ్ల‌లోను, బ‌స్సుల్లోనూ స్త్రీల‌కు ఉచిత ప్ర‌యాణానికి ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించినా దాన్ని అమ‌లులోకి తీసుకురావ‌డానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ (డీఎమ్ఆర్‌సీ)కి మ‌రో ఎనిమిది నెల‌ల స‌మ‌యం అవ‌స‌ర‌మ‌వుతుంది.

అందువ‌ల్ల ముందుగా ఢిల్లీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణానికి ఏర్పాట్లు చేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధం అవుతోందని ఓ డీటీసీ అధికారి పేర్కొన్నాడు. మ‌హిళా ప్ర‌యాణీకుల‌ నుంచి డ‌బ్బులేమీ తీసుకోకుండా టికెట్ ఇవ్వ‌డం లేదా ఉచిత పాస్‌లు జారీచేయ‌డం అనే రెండు ప్ర‌తిపాద‌న‌లు డీటీసీ ఢిల్లీ ప్ర‌భుత్వం ముందు ఉంచిందని ఈ సంద‌ర్భంగా ఆ అధికారి చెప్పాడు.

ఆమ‌ధ్య ఢిల్లీ ప్ర‌భుత్వం మెట్రో రైళ్ల‌లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరితే కేంద్ర ప్ర‌ప‌భుత్వం అందుకు తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే.