రాజధానిలో నైజీరియన్ల కొత్త దందా

ఇన్నాళ్లూ కొకైన్, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్ధాలతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో యువతను మత్తులోకి దింపిన నైజీరియన్లు ఇప్పుడు సరికొత్త దందాకు తెర తీసారు.

ఇప్పటి వరకూ వివిధ మార్గాలలో ఈ మత్తు పదార్ధాలను నగరానికి తీసుకువచ్చిన నైజీరియన్లు ఇప్పుడు వాటి స్ధానంలో అనుమతి లేకుండా ఆహార పదార్ధాలు, కాస్మోటిక్స్, మద్యం సీసాలను నగరానికి చేరవేసేందుకు యత్నించారు.

నైజీరియన్ల గుట్టును శంషాబాద్ విమానాశ్రయంలో రెవెన్యూ ఇంటెలిజెన్సీ అధికారులు రట్టు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేస్తున్న13 టన్నుల ఆహార పదార్గాలను, మద్యం బాటిళ్లను, కాస్మోటిక్స్ ను సీజ్ చేశారు.

మెడికల్, టూరిస్టు వీసాలతో నగరంలో ఉంటున్న ఐదుగురు నైజీరియన్లు ఈ కొత్త దందాకు తెర తీసారు. తొలిసారిగా దేశంలో అడుగుపెడుతున్న ఈ నైజీరియన్లు…. ఎవరికీ అనుమానం రాకుండా పర్యాటక, వైద్యానికి సంబంధించిన వీసాలతో దేశంలోకి వచ్చారని పోలీసు అధికారులు చెబుతున్నారు.

దేశానికి దొంగతనంగా తీసుకువస్తున్నఈ ఆహారపదార్దాల దందా విషయంలో ఎవరెవరి హస్తముందో తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులతో కాకుండా కార్గో ద్వారా విడిగా వచ్చే ఇతర బ్యాగేజీలని కూడా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో తనిఖీ చేశారు. దీనికి సంబంధించి ఐదుగురు నైజీరియన్లు కార్గో నుంచి వారి లగేజీ తీసుకుంటూండగా ఈ కొత్త దందా వెలుగులోకి వచ్చింది.

ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అయిన వాటిలో ఆహార పదార్ధాలు ఉన్నాయని ఆయా దేశాలు సర్టిఫై చేశాయి. అయితే అందులో 1.3 లక్షల విలువ చేసే నూడిల్స్, పామాయిల్, భీఫ్, ఎండు చేపలు, మాంసం, మద్యం సీసాలు, కాస్మోటిక్స్ ఉన్నాయి.

వీటిని చూసిన అధికారులకు దిమ్మ తిరిగింది. కస్టమ్స్ డ్యూటీని ఎగవేసి రాజధానిలో వీటిని విక్రయించేందుకే తీసుకు వచ్చారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇకపై నైజీరియన్ల కదలికలపై మరింత నిఘా పెంచుతామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.