ఇంట్లో చెప్పినా నమ్మలేదు

బిగ్ బాస్ షో ప్రారంభమైన తర్వాత తొలిసారి ఆ రియాలిటీ షో గురించి మీడియాతో మాట్లాడాడు నాగార్జున. షోపై నడుస్తున్న వివాదాలతో పాటు తన అనుభూతుల్ని పంచుకున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడుతో పోలిస్తే.. బిగ్ బాస్ అనేది చాలా విలక్షణమైనదని, అదంతా అనుభవిస్తే కానీ చెప్పలేమని అంటున్నాడు. ప్రస్తుతానికైతే ఒక వారాంతం మాత్రమే పూర్తయిందని, రోజులు గడిచేకొద్ది ఏం జరుగుతుందో చూడాలనే ఆసక్తి తనలో కూడా ఉందన్నాడు.

ఇక బిగ్ బాస్ కంటెస్టంట్ల గురించి ప్రస్తావిస్తూ…  బిగ్ బాస్ సీజన్ 3లోకి ఎవరు రాబోతున్నారనే విషయం నిజంగా తనకు తెలియదంటున్నాడు నాగార్జున. కేవలం కార్యక్రమం ప్రారంభానికి 5 నిమిషాల ముందు, హౌజ్ వెనక ఉన్న ఓ గదిలోకి తనను తీసుకెళ్లారని, కంటెస్టంట్ల వివరాలతో కూడిన వీడియోను చూపించారని చెప్పుకొచ్చాడు. తనకు తెలియని వ్యక్తుల గురించి ఇంకాస్త వివరాలు అందించారని అన్నాడు. తనకు కూడా 5 నిమిషాల ముందే చెప్పారనే విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెబితే వాళ్లు నమ్మలేదని, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అంటున్నాడు నాగ్.

వివాదాలపై స్పందిస్తూ.. హైకోర్టు, తెలంగాణ పోలీసులు తమ విధుల్ని చక్కగా నిర్వరిస్తున్నారని.. విచారణ క్లీన్ గా జరుగుతుందని నమ్ముతున్నానని అన్నాడు నాగ్. నిజంగా అక్రమాలు జరిగి దోషులుగా తేలితే వాళ్లకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. కేసు కోర్టులో ఉన్న కారణంగా ప్రస్తుతానికి ఇంతవరకు మాత్రమే స్పందించగలనని, తను మాత్రం వివాదాలకు దూరంగానే బిగ్ బాస్ ను నడిపిస్తానని అంటున్నాడు నాగ్.