Telugu Global
National

ఆకాశం నుంచి ప‌డిన ఈ వింత వ‌స్తువేమిటి?

బీహార్ మ‌ధుబ‌ని జిల్లాలో అరుదైన రాయిలాంటి దొక‌టి ఆకాశం నుంచి దూసుకువ‌చ్చి ఒక వ‌రిచేలో ప‌డి పెద్ద శ‌బ్దం చేసింది. అది ప‌డిన చోట పొగ పైకి లేచింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న చూసి అక్క‌డ ప‌నిచేసుకుంటున్న రైతులు భ‌యంతో ప‌రుగులు తీశారు. పొగ రావ‌డం ఆగిన త‌ర్వాత అక్క‌డికొచ్చి చూస్తే నాలుగు అడుగుల లోతుగ‌ల గుంట ఏర్ప‌డింది. ఆ గుంట నుండి ఆకాశం నుంచి వ‌చ్చిన వ‌స్తువును బ‌య‌టికి తీశారు. జిల్లా ప‌స్ట్ […]

ఆకాశం నుంచి ప‌డిన ఈ వింత వ‌స్తువేమిటి?
X

బీహార్ మ‌ధుబ‌ని జిల్లాలో అరుదైన రాయిలాంటి దొక‌టి ఆకాశం నుంచి దూసుకువ‌చ్చి ఒక వ‌రిచేలో ప‌డి పెద్ద శ‌బ్దం చేసింది. అది ప‌డిన చోట పొగ పైకి లేచింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న చూసి అక్క‌డ ప‌నిచేసుకుంటున్న రైతులు భ‌యంతో ప‌రుగులు తీశారు. పొగ రావ‌డం ఆగిన త‌ర్వాత అక్క‌డికొచ్చి చూస్తే నాలుగు అడుగుల లోతుగ‌ల గుంట ఏర్ప‌డింది. ఆ గుంట నుండి ఆకాశం నుంచి వ‌చ్చిన వ‌స్తువును బ‌య‌టికి తీశారు. జిల్లా ప‌స్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ షిర్శాత్ క‌పిల్ అశోక్ ఈ విష‌యాన్ని గురువారం ఓ వార్తా సంస్థ‌కు తెలియ‌జేశారు. ‘అది 15 కిలోల‌వ‌ర‌కు బ‌రువు తూగుతున్న‌ది. అయ‌స్కాంత శ‌క్తిని క‌లిగి ఉన్న‌ట్లు గ‌మ‌నించాం. అట్లాగే కొంత మెరుపు కూడా ఆ రాయిలో క‌నిపిస్తుంద’న్నారు అశోక్‌.

దీన్ని ఉల్క‌గా భావిస్తున్నారు చాలామంది. అంత‌రిక్షంలో గ్ర‌హాలు, ఉప గ్ర‌హాలు, న‌క్ష‌త్రాల‌తో పాటు కోట్లాది చిన్న‌ పెద్ద రాళ్లు ర‌ప్ప‌లు కూడా ఉంటాయి. విశ్వం ఏర్ప‌డిన క్ర‌మంలో ఈ రాళ్ళు అంత‌రిక్షంలో విస్త‌రించాయి. అట్లాగే ఇవి ద‌గ్గ‌రి సూర్యుల (న‌క్ష‌త్రాల‌) చుట్టూ తిరిగే క్ర‌మంలో ఒక‌దాన్ని ఒక‌టి ఢీకొని ముక్క‌లై వేగంగా శూన్యంలో ప్ర‌యాణిస్తూ ఉంటాయి.

అట్లా ప్ర‌యాణించే రాళ్ళు భూ వాతావ‌ర‌ణంలోకి రాగానే మండిపోతాయి. అందువ‌ల్ల‌నే అవి భూమి మీద ప‌డ‌కుండానే అంత‌మ‌వుతాయి. రాత్రిపూట తెల్ల‌ని చుక్క‌లు రాలిపోతున్న‌ట్లు క‌నిపించ‌డం తెలిసిందే. ఆ చుక్క‌లే ఉల్క‌లు. అయితే భూ వాతావ‌ర‌ణానికి పూర్తిగా మండ‌కుండా నిలిచి ఉండే రాళ్ళు మాత్రం ఇట్లా భూమి మీద ప‌డి గొయ్యిల‌ను ఏర్ప‌రుస్తాయి. అయితే బీహార్‌లో రైతులు చూసిన రాయి ఉల్క‌నా లేక వేరే ఏదైనా వ‌స్తువా అనేది శాస్త్ర‌వేత్త‌లు నిర్ధారించేదాకా ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంటుంది.

2016లో ఒక ఉల్క ప‌డ‌టం వ‌ల్ల ద‌క్షిణ త‌మిళ‌నాడులో ఒక బ‌స్ డ్రైవ‌ర్ మ‌ర‌ణించాడ‌ని, ముగ్గురు గాయప‌డ్డార‌ని అధికార్లు ప్ర‌క‌టించారు. భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు దానిని నిర్ధారించారు. కానీ అమెరికా సంస్థ నాసా మాత్రం అది ఉల్క కాద‌ని చెప్పింది.

2013లో ర‌ష్యా యూర‌ల్ ప‌ర్వ‌తాల్లో ప‌డిన ఒక ఉల్క వ‌ల్ల 1200 మంది గాయ‌ప‌డ్డారు. వేల గృహాలు దెబ్బ‌తిన్నాయి.

First Published:  27 July 2019 6:18 AM GMT
Next Story