ఆడ‌పిల్ల అని చ‌చ్చిపోతున్నా…

క‌న్న బిడ్డ ఆప‌ద‌లో ఉంటే పిల్లి కూడా పులిగా మారుతుంది క‌దా. కానీ ఈ త‌ల్లిదండ్రులు మాత్రం కళ్ళెదుటే త‌మ కూతురు చావుబ‌తుకుల్లో ఉంటే చూస్తూ ఊరుకున్నారు. త‌ల్లిదండ్రులు త‌లుచుకుంటే ఆమె బ‌తుకుతుంది. కానీ ఆమె ఆడ‌పిల్ల కావ‌డం వ‌ల్ల వారు చేయ‌గ‌లిగిన స‌హాయం కూడా చెయ్య‌కుండా వ‌దిలేశారు. ఆ అమ్మాయి ఏ క్ష‌ణంలోనైనా చ‌నిపోవ‌చ్చ‌ని డాక్ట‌ర్లు అంటున్నారు.

బీహార్‌ స‌ద‌ర్ బ్లాక్‌లో ఉన్న అవ్గిల్ గ్రామానికి చెందిన కాంచ‌న కుమారి అనే టీనేజ్ అమ్మాయి…. రెండు మూత్ర‌పిండాలు (కిడ్నీలు) పూర్తిగా చెడిపోయి గ‌వ‌ర్న‌మెంటు ఆస్ప‌త్రి లో చావు కోసం ఎదురు చూస్తున్న‌ది.

ఇటీవ‌లే మెట్రిక్యులేష‌న్ ప‌రీక్ష ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌యింది. ఆ ఆనందం పూర్తిగా అనుభ‌వించ‌కుండానే ఆమె ఒక రోజు కుప్ప‌కూలిపోయింది. త‌ల్లిదండ్రులు వెంట‌నే ఆమెను పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఐజిఐఎమ్ఎస్‌)కి తీసుకుపోయారు. అక్క‌డ ప‌రీక్షించిన డాక్ట‌ర్లు ఆమెకి రెండు మూత్ర‌పిండాలు పూర్తిగా చెడిపోయాయ‌ని చెప్పారు. మూత్ర‌పిండాలు మార్చ‌క‌పోతే ఆమె బ‌త‌క‌ద‌న్నారు.

త‌మ ద‌గ్గ‌ర మూత్ర పిండాల మార్పిడికి కావ‌ల‌సినంత డ‌బ్బు లేద‌ని చెబుతూ కూతుర్ని షేక్‌పురా జిల్లాలోని సాద‌ర్ గ‌వ‌ర్న‌మెంటు ఆస్ప్ర‌తికి త‌ర‌లించారు. స్థానిక మీడియా వెంట‌నే త‌ల్లిదండ్రుల‌ను క‌లిసి వారి మూత్ర‌పిండాల‌ను కూతురికి దానం చెయ్య‌వ‌చ్చుగ‌దా అని అడిగారు.

అందుకు “ఆమె ఆడ‌పిల్ల‌. అమ్మ‌యినా, నాన్న‌యినా కిడ్నీ ఎవ‌రు దానం చేస్తారు” అంటూ తండ్రి రామాశ్ర‌య్ యాద‌వ్ అన్నాడ‌ని మీడియా పేర్కొంది. త‌ల్లి కూడా కుమార్తె బ‌త‌కాల‌ని ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డంలేద‌ని సదరు మీడియా పేర్కొంది.

దారుణ‌మైన సంగ‌తేమిటంటే ఈ త‌ల్లిదండ్రులు వైద్య చికిత్స కోసం ప్ర‌భుత్వాన్నికూడా సంప్ర‌దించ‌క‌పోవ‌డం. అత్య‌వ‌స‌ర చికిత్స కోసం ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి నుంచి వెంట‌నే డ‌బ్బులిచ్చే వెసులుబాటు బీహార్‌లో ఉంది. క‌నీసం త‌ల్లిదండ్రుల్లో ఒక్క‌రు కూడా ప్ర‌భుత్వాధికార్ల‌ను క‌లువ‌లేదు.

దీన్నిబ‌ట్టి ఈ త‌ల్లిదండ్రులు త‌మ కూతుర్ని కావాల‌నే హ‌త్య‌చేయ‌డానికి పూనుకున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఆ చిన్నారిని ప్ర‌భుత్వ‌మైనా త‌నంత‌ట తాను ముందుకువ‌చ్చి ఆదుకుంటుందేమో చూడాలి. ఇంత‌కంటే ద‌యాహీనులైన త‌ల్లిదండ్రులు ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఉంటారా…. వారిని శిక్షించి ఆ అమ్మాయిని ర‌క్షించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే అని మాన‌వ‌తా వాదులు అంటున్నారు.