Telugu Global
NEWS

స్కూళ్ళలో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చేశారని, కార్పొరేట్ కళాశాలల అధిపతులు మంత్రులుగా పెత్తనం సాగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణలపై కమిషన్ ను నియమిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు లాభార్జనతో విద్యను అందించ రాదని చట్టాలు చెబుతున్నాయని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిందని […]

స్కూళ్ళలో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం
X

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చేశారని, కార్పొరేట్ కళాశాలల అధిపతులు మంత్రులుగా పెత్తనం సాగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణలపై కమిషన్ ను నియమిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు.

ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు లాభార్జనతో విద్యను అందించ రాదని చట్టాలు చెబుతున్నాయని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. విద్యా రంగంపై ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు ఈ రంగంలో సమూల మార్పులు తీసుకు వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

“ఈ బిల్లు ద్వారా ఫీజుల నియంత్రణ మాత్రమే కాదు. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు దోహదం చేస్తుంది” అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలని, లేదా నామమాత్రపు ఫీజు లు తీసుకోవాలని సీఎం చెప్పారు. “ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేదలకు నామమాత్రపు ఫీజులే ఉండాలి. ఆ ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి” అని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

విద్యారంగంపై ప్రభుత్వం నియమించిన కమిషన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తనిఖీలు చేపడుతుందని, నాణ్యతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వడం కాకుండా అవసరమైతే అనుమతులను కూడా రద్దు చేస్తుందని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు 60 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేసే వారని, ఇక ముందు ఆ విధానానికి స్వస్తి పలుకుదామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. “చంద్రబాబు నాయుడు హయాంలో మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ఎనిమిది నెలల వరకు పెండింగ్ లో పెట్టేవారు. దీంతో విద్యార్థులకు భోజనం కూడా సక్రమంగా అందలేదు” అని మండిపడ్డారు.

పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలకు ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం నియమిస్తున్న కమిషన్ లో ఎనిమిది మంది సభ్యులుంటారని బిల్లు సభలో ప్రవేశపెట్టిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

First Published:  30 July 2019 12:47 AM GMT
Next Story