తానూ సిద్ధార్థ్‌లా అవుతానంటున్న మాల్యా

బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా… కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ్‌ ఆత్మహత్యపై స్పందించాడు.

తనది కూడా సిద్ధార్థ్‌ తరహా పరిస్థితే అని ట్విట్టర్‌లో మాల్యా వ్యాఖ్యానించాడు. బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తానని చెబుతున్నా తనకు దేశం సహకరించడం లేదని ఆరోపించాడు మాల్యా.

బ్యాంకులు, విచారణ సంస్థలు ఎంతటి వ్యక్తినైనా నిస్పృహలోకి నెట్టేయగలవు అనడానికి సిద్ధార్థ్ ఉదంతమే నిదర్శనమని మాల్యా వ్యాఖ్యానించాడు.

‘‘వీజీ సిద్ధార్థకు నాకు పరోక్ష సంబంధం ఉంది. ఆయన గొప్ప మనిషి. ప్రజ్ఞావంతుడైన పారిశ్రామికవేత్త. ఆయన లేఖలో చెప్పిన విషయాలు నన్ను కలచివేశాయి. బ్యాంకులు, విచారణ సంస్థలు ఎలాంటి వ్యక్తినైనా నిస్పృహలోకి నెట్టగలవు. అప్పులు పూర్తిగా చెల్లిస్తానని నేను ముందుకొచ్చినప్పటికీ నా విషయంలో ఎంత దారుణంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి…’’ అని మాల్యా ట్వీట్ చేశారు.

‘‘విదేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకులు రుణ గ్రహీతలకు అప్పు చెల్లించడంలో సాయం చేస్తాయి. కానీ నా విషయంలో మాత్రం, ఓ వైపు నా ఆస్తులను జప్తు చేసేందుకు పోటీపడుతూనే మరోవైపు నేను అప్పు చెల్లించేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయి…’’ అని మాల్యా మండిపడ్డాడు.