Telugu Global
NEWS

బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై గవాస్కర్ గరంగరం

శాస్త్రి, కొహ్లీలకు తొత్తులుగా మారారంటూ ఎద్దేవా విమర్శలకు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కౌంటర్ వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్…ప్రపంచకప్ సెమీస్ ఓటమితో కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక సంఘం తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్నారు. టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం అంతంత మాత్రమే ఉన్న ఆటగాళ్లతో కూడిన ఎంపిక సంఘాన్ని.. భారత మాజీ కెప్టెన్, సీనియర్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ దుయ్యబట్టారు. కెప్టెన్ గా కొహ్లీని కొనసాగించడంలో ఔచిత్యమేంటని గవాస్కర్ నిలదీశారు. తోలుబొమ్మల్లా సెలెక్టర్లు.. […]

బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై గవాస్కర్ గరంగరం
X
  • శాస్త్రి, కొహ్లీలకు తొత్తులుగా మారారంటూ ఎద్దేవా
  • విమర్శలకు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కౌంటర్

వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్…ప్రపంచకప్ సెమీస్ ఓటమితో కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక సంఘం తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్నారు.

టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం అంతంత మాత్రమే ఉన్న ఆటగాళ్లతో కూడిన ఎంపిక సంఘాన్ని.. భారత మాజీ కెప్టెన్, సీనియర్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ దుయ్యబట్టారు. కెప్టెన్ గా కొహ్లీని కొనసాగించడంలో ఔచిత్యమేంటని గవాస్కర్ నిలదీశారు.

తోలుబొమ్మల్లా సెలెక్టర్లు..

కేవలం ఆరు టెస్టు మ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక సంఘాన్ని కుంటిబాతుగా గవాస్కర్ అభివర్ణించారు.

కెప్టెన్, కోచ్ ఆడించినట్లు ఆడుతున్న సెలెక్షన్ కమిటీ అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇకముందైనా…సమర్థులైన సెలెక్టర్లతో కూడిన ఎంపిక సంఘాన్ని ఏర్పాటు చేస్తే మంచిదని.. బీసీసీఐకి, క్రికెట్ పాలకమండలికి చురకలంటించారు.

విమర్శకులకు ఎమ్మెస్కే కౌంటర్…

తక్కువ టెస్ట్ మ్యాచ్ లు ఆడినవారికి తక్కువ జ్ఞానం, తక్కువ సమర్థత ఉంటాయన్నది అర్థంలేని వాదనని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.

ఎక్కువ టెస్టులు ఆడిన సెలెక్టర్లకు ఎక్కువ జ్ఞానం ఉంటుందనడంలో అర్థం లేదని…ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎడ్వర్డ్ స్మిత్ కు కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన అనుభవం ఉందని, క్రికెట్ ఆస్ట్ర్రేలియా ఎంపిక సంఘం చైర్మన్ ట్రెవర్ హాన్స్ కు సైతం 7 టెస్టులు మాత్రమే ఆడిన అనుభవం ఉందని గుర్తు చేశాడు.

సచిన్ టెండుల్కర్ లాంటి ఆణిముత్యాన్ని గుర్తించిన భారత క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రాజ్ సింగ్ దుంగార్ పూర్ కు సైతం క్రికెట్ ఆడిన అనుభవం లేదంటూ..ఎమ్మెస్కే ప్రసాద్ సమర్థించుకొన్నాడు.

కుంటిబాతు విమర్శ బాధకలిగించింది….

బీసీసీఐ ఎంపిక సంఘాన్ని కుంటిబాతు అంటూ సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజం విమర్శించడం తనకు బాధ కలిగించిందని..టీమ్ కెప్టెన్,కోచ్ ఆడించినట్లుగా తాము ఆడలేదని…కొన్నిసార్లు వారితో తాము ఏకీభవించలేదని…నాలుగుగోడల మధ్య జరిగిన వాటిని బయటకు చెప్పలేమని చీఫ్ సెలెక్టర్ వివరణ ఇచ్చాడు.

మనదేశంలో ఎవరి అభిప్రాయాలు వారికి చెప్పుకొనే స్వేచ్ఛ ఉందని తెలిపాడు. కెప్టెన్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి లతో తాము కలసి..సమన్వయంతో పనిచేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించామని తెలిపాడు.

ఇదీ విజయాల చిట్టా…

తమ నేతృత్వంలోని ఎంపిక సంఘం ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా భారతజట్టు సాధించిన విజయాలను చీఫ్ సెలెక్టర్ ఏకరువు పెట్టాడు.

గత మూడేళ్ల కాలంలో భారతజట్టు ఆడిన మొత్తం 13 టెస్టు సిరీస్ ల్లో 11 విజయాలతో నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిందని, వన్డే క్రికెట్లో 85 శాతం విజయాలు సాధించామని, ఇండియా-ఏ జట్టు ఆడిన తొమ్మిది టెస్టు సిరీస్ ల్లో ఎనిమిది విజయాలు సాధించిన విషయాన్ని ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తు చేశాడు.

గత మూడేళ్ల కాలంలో 35మంది నవతరం ఆటగాళ్లను తయారు చేసి భారత సీనియర్, ఏ -జట్లకు అందించామని వివరణ ఇచ్చాడు. వచ్చే ఎంపిక సంఘానికి తాము సగర్వంగా బాధ్యతలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు.

మొత్తం మీద..మినీ ప్రపంచకప్, ప్రపంచకప్ సెమీస్ లో భారత్ పరాజయాలు పొందడంతో విమర్శల పిడుగులు వచ్చి…లక్షల రూపాయలు వేతనంగా తీసుకొనే ఎంపిక సంఘం కమ్ ఎమ్మెస్కే ప్రసాద్ అండ్ కో పైన పడుతున్నాయి.

First Published:  30 July 2019 8:05 PM GMT
Next Story