Telugu Global
Cinema & Entertainment

'గుణ 369' సినిమా రివ్యూ

రివ్యూ : గుణ 369 రేటింగ్ : 2.5/5 తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్ ఆచంట, ఆదిత్య మీనన్ తదితరులు సంగీతం : చైతన్ భరధ్వాజ్ నిర్మాత : అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి దర్శకత్వం : అర్జున్ జంధ్యాల ఈరోజు థియేటర్లలోకి రెండు సినిమాలొచ్చాయి. రాక్షసుడు అనే సినిమాను ఓ తమిళ సినిమా నుంచి అధికారికంగా రైట్స్ తీసుకొని రీమేక్ చేశారు. గుణ369 అనే మరో సినిమాను మాత్రం తమిళ సినిమా నుంచి స్పూర్తి పొంది రీమేక్ […]

గుణ 369 సినిమా రివ్యూ
X

రివ్యూ : గుణ 369
రేటింగ్ : 2.5/5
తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్ ఆచంట, ఆదిత్య మీనన్ తదితరులు
సంగీతం : చైతన్ భరధ్వాజ్
నిర్మాత : అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి
దర్శకత్వం : అర్జున్ జంధ్యాల

ఈరోజు థియేటర్లలోకి రెండు సినిమాలొచ్చాయి. రాక్షసుడు అనే సినిమాను ఓ తమిళ సినిమా నుంచి అధికారికంగా రైట్స్ తీసుకొని రీమేక్ చేశారు. గుణ369 అనే మరో సినిమాను మాత్రం తమిళ సినిమా నుంచి స్పూర్తి పొంది రీమేక్ చేసినట్టుంది. అవును…. గుణ369 సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త కావొచ్చు. తమిళ్ లో మాత్రం ఈ తరహా కథలు చాలానే వచ్చాయి.

అయితే కథను కాపీ కొట్టారా, సొంతంగా రాసుకున్నారా అనే విషయాన్ని పక్కనపెడితే.. తీసుకున్న కథను ఎంత పకడ్బందీగా తెరకెక్కించాం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో కొత్త దర్శకుడు అర్జున్ జంధ్యాల బాగా తడబడ్డాడు. కథను కథగా చెప్పలేక, కమర్షియల్ హంగులు అద్దలేక నానా హైరానా పడ్డాడు. ఫలితంగా సినిమా ఫస్టాఫ్ సీరియల్ కంటే ఘోరంగా తయారవ్వగా.. సెకెండాఫ్ మాత్రం సూపర్ హిట్ అయింది.

ఒంగోలులోని ఓ కాలనీలో ఉంటాడు గుణ. కాలనీ మొత్తంలో మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకుంటాడు. అందరి నోళ్లలో నానుతుంటాడు. అదే కాలనీకి పక్కగా రాధ అనే రౌడీషీటర్ ఉంటాడు. ఒంగోలు మొత్తానికి రాధ అంటే గుండెదడ. చిన్నప్పట్నుంచి గుణ ఎలాంటి వాడో రాధకు తెలుసు. అదే కాలనీలో కొత్తగా సెల్ ఫోన్ పాయింట్ ఓపెన్ చేసిన గీతను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు గుణ.

ఓవైపు కథ ఇలా సాగుతుంటుంది. మరోవైపు గుణ స్నేహితుడికి స్నేహితులైన కొంతమంది వ్యక్తులు రాధపై దాడిచేస్తారు. వాళ్లను చంపేందుకు రాధ ఎదురుచూస్తుంటాడు. కానీ ఈ విషయాలేవీ గుణకు తెలియవు. తన ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి రాధతో కాంప్రమైజ్ ఏర్పాటు చేస్తాడు. కానీ ఆరోజు ఆ ఆరుగురు స్నేహితులు కాంప్రమైజ్ అవ్వరు. ఏకంగా రాధను చంపేస్తారు. ఊహించని పరిణామానికి గుణ షాక్ అవుతాడు. అదే షాక్ లో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం, 3 నెలలు రిమాండ్ లో ఉంచడం చకచకా జరిగిపోతాయి. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరు? వాళ్లను గుణ ఎలా పట్టుకున్నాడనేది మిగిలిన కథ? మధ్యలో కథకు అనుగుణంగా హీరోయిన్ త్రెడ్ కూడా జతచేశారు.

నిజానికి ఈ సినిమా చూస్తున్నంతసేపు గతంలో తమిళ్ లో కార్తి, విశాల్ చేసిన కొన్ని సినిమాలు లీలగా గుర్తొస్తుంటాయి. ఇలాంటి కథల్ని వాళ్లు ఇదివరకే టచ్ చేశారు. ఉదాహరణకు నాపేరు శివ సినిమానే తీసుకుంటే.. దానికి దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కానీ నాపేరు శివలో లవ్ ట్రాక్ సూపర్ హిట్. గుణలో మాత్రం లవ్ ట్రాక్ అట్టర్ ఫెయిల్యూర్. లవ్ ట్రాక్ సరిగ్గా తీయలేడనే విమర్శ బోయపాటిపై ఉంది. ఇప్పుడు అర్జున్ జంధ్యాల కూడా గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. ఫస్టాఫ్ ను సీరియల్ కంటే అధ్వాన్నంగా తీశాడు.

సెకండాఫ్ నుంచి మాత్రం సినిమా పరుగులు పెడుతుంది. ఊహించని ట్విస్టులతో సాగిపోతుంది. ఇక్కడ కూడా బోయపాటికి శిష్యుడు అనిపించుకున్నాడు అర్జున్ జంధ్యాల. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే స్వయంగా బోయపాటి డైరక్ట్ చేశాడేమో అనిపిస్తుంది. అంతలా ఆకట్టుకుంటాయి యాక్షన్ సీన్స్. దీనికి అదనంగా జోడించిన ట్విస్టులు మరో హైలైట్. ఇక్కడ మహేష్ ఆచంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సైడ్ క్యారెక్టర్లు, కమెడియన్ రోల్స్ చేస్తూ.. రంగస్థలం సినిమాతో ఓ గుర్తింపు తెచ్చుకున్న మహేష్.. గుణ369లో అదరగొట్టాడు. అతడి క్యారెక్టర్ ను ఇక్కడ చెప్పేకంటే సినిమాలో చూడాల్సిందే.

హీరో కార్తికేయ ఈ సినిమాకు బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో యాక్షన్ కథలకు సూటయ్యే హీరోల జాబితాలో తను కూడా చేరిపోయాడు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు లవ్ ట్రాక్ లో మాత్రం కార్తికేయ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అతడి ఎక్స్ ప్రెషన్స్ సగటు సీరియల్ హీరో నటన కంటే ఘోరంగా ఉంది. హీరోయిన్ అనఘ బాగా నటించింది. కానీ ఆమెలో కమర్షియల్ హీరోయిన్ క్వాలిటీస్ కనిపించలేదు. ఆదిత్య మీనన్, నరేష్, శివాజీరాజా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ గా కూడా ఈ సినిమా యావరేజ్ గానే ఉంది. అర్జున్ జంధ్యాల డైరక్షన్ అక్కడక్కడ బాగుంది. అతడు రాసుకున్న కథ బాగున్నప్పటికీ, దానికి అతడు రాసుకున్న స్క్రీన్ ప్లే బాగాలేదు. ఇక మాటలు కూడా అతడే రాయడం సినిమాకు కలిసిరాలేదు. కనీసం ఈ విభాగాన్నయినా వేరే వాళ్లకు అప్పగించాల్సింది. సినిమాటోగ్రాఫర్ రామ్ మాత్రం శక్తివంచన లేకుండా ఔట్ పుట్ ఇచ్చాడు. ఎడిటర్ తమ్మిరాజు, సంగీత దర్శకుడు చేతన్ భరధ్వాజ్ కు పాస్ మార్కులే పడతాయి. రీరికార్డింగ్, పాటల విషయంలో కొన్ని చోట్ల చేతన్ శభాష్ అనిపించుకుంటాడు, మరికొన్ని చోట్ల విమర్శలపాలవుతాడు. నిర్మాతలు అవసరం అయిన మేరకు ఖర్చుపెట్టారు. అనవసర ఖర్చుకు మాత్రం పోలేదు.

బలాలు
– సెకెండ్ హాఫ్
– యాక్షన్ ఎపిసోడ్స్
– కార్తికేయ యాక్షన్
– మహేష్ ఆచంట
– క్లయిమాక్స్

బలహీనతలు
– ఫస్టాఫ్
– లవ్ ట్రాక్
– ఎడిటింగ్
– నేపథ్య సంగీతం
– మాటలు

ఫైనల్ గా..

గుణ369లో బలమైన సందేశం ఉంది. మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. కానీ వాటిని ఒక పద్ధతి ప్రకారం చూపించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. తమిళ సినిమాల టైపులో పూర్తిగా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినా బాగుండేది. కమర్షియల్ వాల్యూస్ కు పోవడంతో సినిమా గాడితప్పింది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సినిమాను భరించగలిగితే.. అక్కడ్నుంచి గుణ మెప్పిస్తాడు.

First Published:  2 Aug 2019 5:59 AM GMT
Next Story