కాశ్మీరీ సమస్యకు ఇదే పరిష్కారమా?

ఆర్టికల్‌ 370 రద్దు. భారతీయుల నరాల్లో తాజాగా దేశభక్తిని ఉరకలెత్తిస్తున్న అంశం. ఆగస్ట్ 15న మాత్రమే దేశం గురించి ఆలోచించే వారు కూడా మోడీ-షాలు పార్లమెంట్‌ వేదికగా ప్రజాస్వామ్యంపై చేసిన ప్రయోగంతో దేశభక్తిని గుర్తు తెచ్చుకున్నారు.
ఆర్టికల్‌ 370 రద్దుతో ఇక కశ్మీర్ సమస్య పరిష్కారం అయిందంటూ భూతకాలాన్ని, భవిష్యత్తును పరిగణించకుండా వర్తమానం ఆధారంగా తీర్పులు చెబుతున్నారు. కశ్మీర్‌ భారత్‌లో పూర్తిగా కలిసిపోయిందని సంబరపడుతున్నారు. అలా సంబరపడుతున్న వారినీ తప్పుపట్టలేం.

దేశం దూసుకెళ్తోందన్న భావన, భక్తితో వచ్చిన అభిప్రాయమే అది. ఈ భావోద్వేగపూరిత భక్తి… దేశం ఆర్థికంగా కుదేలైన విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసేంత శక్తివంతమైనది. కానీ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు మా దేశం అని గర్వంగా చెప్పుకునే భారతీయులు 370 రద్దు సందర్భంగా మాత్రం నియంతపోకడలనే ఆస్వాదించారు. మనది ప్రజాస్వామ్య దేశం అన్నది తాత్కాలికంగా మరిచిపోయారు.

రాజ్యసభ తలుపులు మూసేసి మా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా అని రక్త కన్నీరు కాల్చిన మన తెలుగు ప్రజలు కూడా వారిలో అంతర్భాగమే. కశ్మీర్ లాంటి అంశం ఏ కోణంలో చూసినా, ఆయా కోణంలో చేసిన వారికి సమంజసంగానే కనిపిస్తుంది. తమ వాదనే బలం అని తటస్తులను ఒప్పించేందుకు అవసరమైన అంశాలు ఇరుపక్షాలకూ కావాల్సినన్ని ఉంటాయి. అందుకే మెజారిటీ ప్రచారానిదే ఈ అంశంపై పైచేయి.

అనుకూలమైన అంశాల ఆధారంగా మాత్రమే వాదించే ధోరణిలో ఒక సుఖం, వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది భారతీయులు అదే పంథాకు పరిమితం అయ్యాదు. చర్చలు, వాదనల వల్ల ఎదురయ్యే సంఘర్షణను సైతం భరించలేనంత సున్నిత మనస్కులుగా మారిపోయారు. ఆర్ఠికల్‌ రద్దు భారత్‌ సాధించిన గొప్ప విజయం అని నినదిస్తున్న వారు… మన తోటి భారతీయులైన కశ్మీర్‌లు గృహనిర్భంధంలో ఉండగా ఈ రద్దు జరిగిందన్న అంశాన్ని మాత్రమే గుర్తిండి కూడా గుర్తు చేసుకోలేకపోతున్నారు.

ప్రజాస్వామంలో తమకు చాటి లేరెవ్వరూ అని ఇంతకాలం గర్వించిన సగటు భారతీయుడు… కశ్మీర్‌ ప్రజలను గృహనిర్బంధంలో ఉంచి, వారికి కనీసం టీవీలు చూసే అవకాశం లేకుండా, ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వాడే అక్కరు లేకుండా సాగించిన ఈ రద్దు తంతుకు ఇకపై మనస్సాక్షికైనా సమాధానం చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఒక మతంపై భారతీయుల్లో నానాటికి ఒక విద్వేశాన్ని పెంచుతున్నాయి కొన్ని శక్తులు. ఆ శక్తులు ఎంత వరకు విజయం సాధించాయంటే… ఏడు దశాబ్దాలుగా మనతో కలిసి ఉంటున్న కశ్మీర్‌లను కూడా వారంతా పాకిస్థాన్‌ సానుభూతిపరులే అని భావించేంతగా.

ప్రభావిత కశ్మీర్‌ ప్రజలను ఇలా నిర్బంధంలో ఉంచి ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం సరికాదని… ఎవరైనా అంటే వారు తప్పనిసరిగా దేశద్రోహులే అన్న ప్రచారం చేసే మూకదే ఇప్పుడు ఆధిపత్యం నడుస్తోంది. కాబట్టి ఏంజరుగుతుందో తెలిసిన గొంతుకలు కూడా కాలమే వారికి పాఠాలు నేర్పుతుంది అని మౌనంగా ఉంటున్నారే గానీ… చైతన్యవంతం చేసే సాహసం చేయలేకపోతున్నాయి. ముందు పిచ్చిడిగా ముద్రవేయ్.. ఆ తర్వాత రాళ్లు విసిరేవాళ్లు స్వచ్చందంగా వస్తారన్నట్టు… కొంత కాలంగా కశ్మీర్‌ ప్రత్యేక హక్కులపై దేశంలోని జనులు ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు.

కశ్మీర్‌లో భూములు మనమెందుకు కొనకూడదు అన్నది అందులో ఒకటి. భూములు కొనేందుకు తహతహలాడుతున్న వారు కశ్మీర్ వరకు ఎందుకు గానీ… అరకు మన్యంలో, భద్రాచలం గిరిజన ప్రాంతాల్లో కొనండి . 1/70 చట్టం కింద బెండు తీస్తారు. కాబట్టి కశ్మీర్‌ భూములకు మాత్రమే కాదు… దేశంలో అనేక ప్రాంతాలకు ఇతరులు వచ్చి భూములు కొనడానికి వీల్లేదన్న చట్ట రక్షణ ఉంది. అది ఎందుకు పెట్టారంటే… ఏ ప్రాంతమైతే, ఏ ప్రజలైతే సులువుగా దోపిడికి గురయ్యే అవకాశం ఉందో ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను ఆధిపత్య శక్తుల నుంచి రక్షించేందుకు ఈ ఏర్పాటు రాజ్యాంగం ఇస్తూ వచ్చింది.

అవన్నీ వదిలేసి ఒక్క కశ్మీర్‌ గురించే ఆక్రోశం వెళ్లగక్కుతున్నామంటే కారణం… మన బుర్రల్లో కశ్మీర్‌ ప్రజలకు, పాకిస్థాన్‌ ప్రజలకు మధ్య తేడాను గుర్తించే గుజ్జు పనిచేయడం లేదని అర్థం. కొద్ది రోజుల క్రితమే మంత్రిగా అరుణ్‌ జైట్లీ ఒక ప్రకటన ఇచ్చారు. కశ్మీర్‌లో ఇతరులు స్థిరాస్తులు కొనేందుకు అవకాశం లేకుండాపోయింది అందుకు పారిశ్రామికవేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టడం లేదని. దీన్ని బట్టే అర్థమవుతోంది. 370 రద్దు తర్వాత కార్పొరేట్ శక్తులు భూతలస్వర్గంపై భూతాల్లా వేలాడబోతున్నాయని. ఇకపై బడా సినీ నిర్మాతలకు కశ్మీర్‌లో ఓ వంద ఎకరాలకు తగ్గకుండా స్టూడియోలు కట్టడమే డ్రీమ్.

కశ్మీర్‌పై భక్తజనులకు మరో కోపం… మనకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వరట అన్నది. తెలంగాణలో 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే అని చట్టం చెబుతోంది. ఏపీలో ప్రైవేట్‌ ఉద్యోగాల్లో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని కొత్త ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు కశ్మీరీలు వారి ప్రాంతంలో ఉద్యోగాలు వారికే అనగానే మనకుకోపమెందుకు వస్తోంది?. మనకు తెలియకుండానే మన మెడడులో ఎక్కడో కశ్మీర్‌ను ఆక్రమించి అనుభవించాలన్న కసి కనిపిస్తోంది. కశ్మీర్‌ను పొడిస్తే పాకిస్థాన్‌కు రక్తం వస్తుందన్న భ్రమ ఆవరించింది.

మూడో అభ్యంతరం. కశ్మీర్ అమ్మాయిలను ఇతరులు వివాహం చేసుకుంటే ఆమె ఆస్తి హక్కును కోల్పోవడం ఏమిటి అన్నది. ఇది దుర్మార్గమే. మహిళల పట్ల వివక్ష చూపడమే. ఈ నిబంధన చెల్లదు అని కశ్మీర్ హైకోర్టు కూడా చెప్పింది. భారతీయులను వివాహం చేసుకుంటే కశ్మీర్ పౌరసత్వం కోల్పోతున్న మహిళా… అదే పాకిస్థాన్‌ను వివాహం చేసుకుంటే పౌరసత్వం రద్దు కావడం లేదు పైగా పెళ్లి చేసుకున్న వ్యక్తికి పౌరసత్వం వస్తోంది అన్నది.

పాకిస్థాన్‌ వ్యక్తిని చేసుకుంటే పౌరసత్వం వస్తుందని ఎక్కడా చెప్పలేదు. కానీ స్థానికతను నిర్దారించే అధికారం కశ్మీర్ అసెంబ్లీకి ఇచ్చారు కాబట్టి పాకిస్థాన్‌ పౌరులకు పౌరసత్వం వచ్చి ఉండవచ్చు. దాన్ని నిరోధించడానికి ఇప్పుడు అనుసరించినదే సరైన పద్దతి అనుకుంటే పొరపాటే. వేల ఏళ్ల చరిత్రలో ప్రజలను నిర్బంధంలో ఉంచి వారి మనోవాంచకు విరుద్దంగా నిర్ణయాలు తీసుకున్న రాజ్యం విజయవంతమైన చరిత్ర దేశంలోనే కాదు ప్రపంచ హిస్టరీలోనే లేదు.

ఇంతకాలం 370 ద్వారా భారత్‌ తమకు కొన్ని రక్షణ చర్యలు ఇచ్చిందన్న భరోసా కశ్మీర్‌ ప్రజల్లో ఉండేది. ఇప్పుడు దాన్ని తుంచేశారు. ఇప్పుడు వారికి భారత్ ఒకటే, పక్కదేశం ఒకటే అన్న పరిస్థితిని కల్పించారు. 370 రద్దు ద్వారానే సమస్య పరిష్కారం అయ్యే అవకాశమే ఉంటే ఆ పని గత కాంగ్రెస్ ప్రభుత్వాలే ఎప్పుడో చేసి ఉండేవి.

ఎందుకంటే కశ్మీర్ రగులుతుంటే బీజేపీకి లాభమే గానీ… కాంగ్రెస్‌కూ నష్టమే. ఇప్పుడు దేశంలో ఏం నడుస్తోంది అంటే… ఒకటే… గొడవెందుకు ? గొర్రేలా సాగిపో… అన్న సిద్ధాంతమే నడుస్తోంది. కొన్ని శక్తులు చెప్పినట్టు గొర్రెల్లా ముందుకు సాగిన వారి దేశభక్తులు… ఆ గొర్రెల మందకు కొత్త తోవలు చూపే ప్రయత్నం చేస్తే మాత్రం గాట్లకు కాచుకోవాలి.

కశ్మీర్ అంశంలో మీడియా సిగ్గుమొగ్గలు పరాకాష్టకు చేరాయి. ప్రజాస్వామ్యం బతికుంటేనే తమకు ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలిసినా సరే పత్రికలన్నీ 370 రద్దుతో ఏడు దశాబ్దాల కశ్మీర్ సమస్య పరిష్కారం అయిపోయిందని కీర్తించాయే గానీ… మనతో 70ఏళ్లకు పైగా నడిచిన కశ్మీర్‌ను బయట ఏమి జరుగుతుందో తెలుసుకోలేని నిర్బంధంలో ఉంచడానని మాత్రం ప్రశ్నించలేకపోయాయి.

ప్రజాస్వామ్యంలో ఇది తప్పు కదా అని కూనిరాగం కూడా తీయడం లేదు. కారణం… నాడు ఎమర్జెన్సీ సమయంలో నీ సంగతి తేలుస్తానని ఇందిరా హెచ్చరిస్తే… ”మహా అయితే తిరిగి హౌరా బిడ్జిపై నా తొలి ప్రస్తాన స్థితికి మాత్రమే తీసుకెళ్లగలరు” అని ఎదురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ అధినేత రామనాథ్‌ గోయంక లాంటి… అక్షరం కోసం, ఆధిపత్య నివారణ కోసం నిలబడే మీడియా శక్తులు లేకపోవడమే.

కార్పొరేట్‌కు, రాజకీయానికి సంధానకర్తలుగా మాత్రమే మిగిలిపోయాయి మీడియా సంస్థలు. అందుకే రాజకీయ నాయకుల తరహాలోనే మీడియా పెద్దలకు ఈడీ అన్నా, సీబీఐ అన్నా భయం. ఆ భయంలో కూడిన భక్తి కారణంగానే ఢిల్లీ పెద్దలుగా ఎవరున్నా వారు చేసిన దానికి ఆధునిక సౌకర్యాలతో విస్రృత ప్రచారం కల్పిస్తోంది.

మొత్తం మీద 370 రద్దుతో సమస్య పరిష్కారం అయిపోలేదు. 370 రద్దు ఒక ప్రయోగం మాత్రమే. కశ్మీర్ ప్రజలు ఇంకా నిర్భంధం నుంచి బయటకు రాకుండానే… వారికి వారిపై జరిగిన ప్రయోగం ఏంటో తెలియకముందే అమిత్ షా- మోడీ విజయం సాధించారనుకోవడం తొందరపాటే అవుతుంది. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. కానీ కశ్మీర్‌ ప్రజల మనసుల్లో ఆ భావన పెరుగుతుందా లేక తాము మోసపోయామన్న అభిప్రాయం గూడు కట్టుకుంటుందా అన్న దాని బట్టే ఈ ప్రయోగం నెగ్గిందా, వికటించిందా అన్నది ఆధారపడి ఉంటుంది.

తలుపులేసి మా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా అని గోల చేసిన రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల చేత కూడా… కశ్మీర్‌ను బంధించి అయినా సరే ఆర్టికల్ 370 రద్దు చేయడంలో చప్పట్లు కొట్టించుకున్న మోడీ- షాల రాజకీయ బలాన్ని, చతురతను మాత్రం మెచ్చుకోవాల్సిందే.

-రామనాథ్‌. బి