మహేష్ లో ఇన్ని కోణాలు… ఇప్పుడేంటి?

టాలీవుడ్‌ మిల్కీ బాయ్‌గా మహేష్ కు ఒకప్పటి పేరు. క్యూట్‌గా, స్మార్ట్‌గా ఉండడంతో పాటు లవ్‌లీ డైలాగ్‌లతో లేడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఆయన తీసిన సినిమాల్లో మురారి వరకు మహేష్ లవర్‌ బాయ్‌గానే కొనసాగారు. అయితే సినిమాల్లో ఒక హీరో డిపరెంట్‌ రోల్స్‌ చేస్తేనే ప్రేక్షకులకు థ్రిల్‌గా ఉంటుందని ఆలోచించే మన డైరెక్టర్లు అప్పుడప్పుడు హీరోల షేడ్స్‌ను మార్చేస్తుంటారు. అలా అప్పటి వరకు కేవలం మాటల రచయితగానే కొనసాగిన త్రివిక్రమ్‌ మహేష్ ను ‘అతడు’ సినిమాతో ఒక్కసారిగా యాక్షన్‌ హీరోగా మార్చేశాడు. అప్పటి వరకు ఉన్న లవ్‌నెస్‌తో పాటు బిగ్‌ యాక్షన్‌ను త్రివిక్రమ్‌ పండించడంతో మహేష్ అందుకు కనెక్టయ్యాడు.

ఇక ఈ మిల్కీబాయ్‌ కేవలం లవ్‌ యాక్షన్‌కే మాత్రమేనా..? ఆయన కామెడీకి పనికిరాడా..? అన్నట్లు దర్శకుడు శ్రీనువైట్ల మహేష్ ను లవ్‌, యాక్షన్‌తో పాటు కామెడీ హీరోను చేసేశాడు. అప్పటి వరకు టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న శ్రీనువైట్లకు మహేష్ కామెడీ నటన కొత్తగా అనిపించడంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు మహేష్ లోని కామెడీని యాక్సెప్ట్‌ చేశారు. దీంతో ‘మహేష్ నవరసాల హీరో’ అని పేరు తెచ్చుకున్నాడు.

‘అతడు’ సినిమాలో మహేష్ సైలెంట్‌ క్యాకెక్టర్‌తో పాటు భారీ యాక్షన్‌ ఉండడాన్ని గమనించిన పూరి జగన్నాథ్‌ దానిని పూర్తి యాక్షన్‌ చేసి ‘పోకిరీ’ తీసి రికార్డులు కొల్లగొట్టాడు. దీంతో మహేష్ ఫుల్‌ యాక్షన్‌ హీరో అనిపించుకున్నాడు. ఇలా మహేష్ లోని అన్ని రకాల షేడ్స్‌ను దర్శకులు బయటపెట్టడం మొదలు పెట్టారు.

ఇక మహేష్ పూర్తి యాక్షన్‌ హీరోనే అనుకుంటున్న తరుణంలో ఆయన ఇవే కాదు మంచి మంచి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు కూడా చెప్పగలడు అని కొరటాల శివ ఆయనలోని డైలాగ్‌ కింగ్‌ను బయటపెట్టించాడు. దీంతో ‘శ్రీమంతడు’, ‘భరత్‌ అనే నేను’లల్లో మహేష్ ను విభిన్నంగా చూపించారు.

‘భరత్‌ అనే నేను’ సినిమా తరువాత మహేష్ తీస్తున్న లెటెస్ట్‌ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు దిల్‌రాజు, అనిల్‌ శంకర్‌లతో కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడే ఫ్యాన్స్‌కు కొత్త ఆలోచన వస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఎలా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో డైరెక్టర్‌ బట్టి సినిమా ఎలా ఉంటుందో అంచనా వేసుకునే వాళ్లు. కానీ మొదటిసారి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తుండడంతో ఈ సినిమాలో మహేష్ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాఫిక్‌గా మారింది.

అయితే ఇటీవల విడుదలయిన పోస్టర్‌ను బట్టి చూస్తే మహేష్ ఇందులో కొత్తగానే కనిపించనున్నాడని అర్థమవుతోంది. ఓ ట్రెయిన్‌ సెట్‌ వేసి అందులో మహేష్ షేడ్‌లో కనిపించనుండడంతో ఇప్పటికీ ఫ్యాన్స్‌ కన్ఫ్యూజన్‌లోనే ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం అనిల్‌ రావిపూడి మహేష్ నుంచి కామెడీని పిండుకున్నాడని తెలుస్తోంది. వరుసగా సోలో యాక్షన్‌ సినిమాల్లో కనిపించిన మహేష్ ఈసారి ప్రేక్షకులకు నవ్వులు పూయించనున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

‘ఫన్‌ టూ’ బంపర్‌ హిట్టుతో జోష్‌లో ఉన్న అనిల్‌ ఈసారి మహేష్ ను ఎంచుకుని సినిమా తీస్తున్నాడు. ‘ఫన్‌ టూ’లోని కామెడీ ప్రేక్షకులను థియుటర్లకు పరుగులు పెట్టించింది. దీంతో అనిల్‌ కామెడీనే ఎంచుకుని సినిమా తీస్తున్నాడా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటి వరకు మహేష్ నటించిన కామెడీ సినిమాల్లో ‘దూకుడు’ ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుత సమయంలో ప్రేక్షకులు హ్యాపీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకుంటున్న తరుణంలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ అని అనిపించుకుంటాడా..? యాక్షన్ లేదా కామెడీ దేన్ని చూపించబోతున్నాడనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో బాగా పెరిగిపోయింది.