ఈ సినిమా కూడా రీమేక్ అంటున్నారు!

మన్మథుడు-2 సినిమా రీమేక్ అనే విషయాన్ని అస్సలు బయటపెట్టలేదు మేకర్స్. చివరికి లీకుల ద్వారా అది బయటకొచ్చి, రీమేక్ అంటూ రచ్చ జరగడంతో యూనిట్ ఒప్పుకుంది. అవును.. మా సినిమా రీమేక్ అని అంగీకరించింది. అంతేతప్ప, నేరుగా ఇది రీమేక్ అనే విషయాన్ని బయటపెట్టడానికి వాళ్లు ఇష్టపడలేదు. రాహుల్ రాసుకున్న స్ట్రయిట్ కథ అనే యాంగిల్ లో ప్రచారం కల్పించారు.

కట్ చేస్తే, ఇలాంటి వ్యవహారమే ‘ఎవరు’ అనే సినిమా విషయంలో కూడా జరుగుతోంది. అన్నీ తానై అడవి శేష్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా రీమేక్ అనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఓ హిందీ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని కొందరు అంటుంటే.. ఓ స్పెయిన్ సినిమా ఆధారంగా ‘ఎవరు’ సినిమా వస్తోందని మరికొందరు వాదిస్తున్నారు. అటు యూనిట్ మాత్రం ఇదొక రీమేక్ అనే విషయాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు.

నిజానికి ‘ఎవరు’ సినిమాకు సంబంధించి ఏదో సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని మరీ తెరకెక్కించారు. కానీ అసలు సినిమా ఏంటనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. అసలు రీమేక్ అనే విషయాన్నే అంగీకరించడం లేదు. ఒకవేళ మీడియాలో సాక్ష్యాలతో సహా బయటపడితే అప్పుడు అంగీకరిస్తారేమో చూడాలి.