టీ-20 క్రికెట్లో సరికొత్త ప్రపంచరికార్డు

  • 18 పరుగులకే 7 వికెట్ల కోలిన్ అకెర్ మాన్ 
  • ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో అరుదైన ఘనత

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ పోటీలలో భాగంగా…వార్విక్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో లెస్టర్ షైర్ కమ్ సౌతాఫ్రికా స్పిన్నర్ కోలిన్ అకెర్ మాన్ ఈ ఘనత సంపాదించాడు.

టీ-20 క్రికెట్లో ఒక్కో బౌలర్ కు నాలుగు ఓవర్లు మాత్రమే బౌల్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 24 బాల్స్ లో మూడు లేదా నాలుగు వికెట్లు పడగొడితేనే అదో గొప్ప ఘనకార్యంగా పరిగణిస్తారు. అయితే…ఇంగ్లండ్ లోని గ్రేస్ రోడ్ వేదికగా వార్విక్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో లెస్టర్ షైర్ స్పిన్నర్ కోలిన్ అకెర్ మ్యాన్ విశ్వరూపం ప్రదర్శించాడు.

కేవలం నాలుగు ఓవర్లలోనే రెండు కాదు…మూడు కాదు…ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వార్విక్ షైర్ బ్యాట్స్ మన్ మైకేల్ బర్జెస్, సామ్ హెయిన్, విల్ రోడ్స్, లైమ్ బ్యాంక్స్, అలెక్స్ థాంప్సన్, హెన్రీ బ్రూక్స్, జీతన్ పటేల్ వికెట్లను అకెర్ మ్యాన్ పడగొట్టాడు.

ఈ క్రమంలో 2011లో గ్లామోర్గన్ పై సోమర్ సెట్ బౌలర్ అరుల్ సుపయ్య పేరుతో ఉన్న 5 పరుగులకే 6 వికెట్ల ప్రపంచ రికార్డును.. అకెరమ్యాన్ అధిగమించాడు.

బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా ఉన్న తాను… ఓ బౌలర్ గా ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పగలనని కలలోనైనా ఊహించలేదని తమజట్టు విజయానంతరం కోలిన్ అకెర్ మ్యాన్ పొంగిపోతూ చెప్పాడు.