ఇదేమి భోజనం.. నారాయణ.. నారాయణా ?

ఉడకని అన్నం… నీళ్లలాంటి పప్పు…. ఏ కూరగాయో కూడా తెలియని కూరలు… పల్చని మజ్జిగ… భోజనంలో క్రిములు, కీటకాలు. ఇదీ హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీ పరిధిలోని నారాయణ కళాశాల హాస్టల్ పరిస్థితి.

ఇలాంటి భోజనం పెడుతున్నారంటూ గురువారం రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నారాయణ కళాశాలలోని కుర్చీలు, బల్లలు ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం కూడా విద్యార్ధుల ఆందోళన కొనసాగుతోంది. దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది వరకూ విద్యార్ధులున్న నారాయణ కళాశాలలో గత కొంత కాలంగా భోజనం నాసిరకంగా ఉంటోందంటూ విద్యార్ధులు, వారి తలితండ్రులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరించడం వివాదమవుతోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు నారాయణ కళాశాల వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు ఐదు గంటల పాటు విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు ఫ్లోరులున్న ఈ హాస్టల్ శుక్రవారం ఉదయం నుంచి ఎవ్వరూ బయటకు రాకుండా తలుపులు మూసివేసి తాళాలు వేసింది నారాయణ యాజమాన్యం. ఇక్కడి ఆహారం ఉడకకపోవడంతో పాటు భోజనంలో అప్పుడప్పుడు క్రిములు, కీటకాలు కూడా వస్తున్నాయంటూ విద్యార్ధులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని తలిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మాదాపూర్ పోలీసులు హాస్టల్ కు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేసారు. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్ర్రాలలోని నారాయణ కళాశాలల్లో ఆహారం సరిగా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు ఇక్కడి చదువు వొత్తిడి కారణంగా విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడడం కూడా వివాదాస్పదమవుతోంది. ఇన్ని జరుగుతున్నా నారాయణ యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలొస్తున్నాయి.