కశ్మీర్‌ భూపందేరం?… స్టూడియోలు కట్టాలని ప్రధాని పిలుపు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆర్టికల్ 370 రద్దు అవసరాన్ని దేశానికి వివరించారు. కశ్మీర్‌ను తిరిగి భూతల స్వర్గం చేస్తామని ప్రకటించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ అంశంపై ప్రసంగించిన మోడీ… శాంతియుత, సురక్షిత, సమృద్ధ కశ్మీరే తన లక్ష్యమని ప్రకటించారు.

కశ్మీర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టికల్ 370 వల్ల ఇప్పటి వరకు కశ్మీర్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగలేదన్నారు. పాకిస్థాన్‌కు మాత్రమే ఈ ఆర్టికల్ ఉపయోగపడిందన్నారు.

కశ్మీర్‌, లఢఖ్‌లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అయితే కశ్మీర్‌లో భూములపైనే కేంద్రం కన్ను పడిందని అందుకే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కార్పొరేట్లకు సుందర కశ్మీర్‌లోని భూములను అప్పగించేందుకు కుట్ర చేస్తోందన్న ఆరోపణ ప్రతిపక్షాల నుంచి వచ్చింది.

ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో సినీ స్డూడియోలను ఏర్పాటు చేయాల్సిందిగా హిందీ, తెలుగు, తమిళ…ఇతర చిత్ర పరిశ్రమల పెద్దలకు మోడీ పిలుపునివ్వడం విశేషం.

మోడీ ప్రసంగంపై కశ్మీర్‌ ప్రజల అసంతృప్తి

మోడీ ప్రసంగంపై కశ్మీర్ ప్రజలు మాత్రం సంతృప్తి చెందలేదు. మోడీ ప్రసంగంపై మాట్లాడిన పలువురు కశ్మీరీలు… భారత ప్రభుత్వానికి సుందరమైన కశ్మీర్ భూములు మాత్రమే కావాలి… ఇక్కడి ప్రజలు కాదన్న విషయం మోడీ ప్రసంగంతో స్పష్టంగా అర్థమైందన్నారు.

తమను నిర్బంధించి, అప్రజాస్వామికంగా ఆర్టికల్‌ 370ని రద్దు చేశారని విమర్శించారు. పలు రంగాలకు చెందిన కశ్మీరుల నుంచి మోడీ ప్రసంగంపై అభిప్రాయాలను వెల్లడించారు.

ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ఇక్కడి భూములను మౌలిక సదుపాయాల పేరుతో దోపిడి చేసే అవకాశం ఉందని ఒక వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు.

నిజంగా కశ్మీర్ భూములపై కాకుండా, కశ్మీర్ ప్రజలపై అభిమానం ఉండి ఉంటే తమతో చర్చించి నిర్ణయాలు తీసుకునే వారని ఒక వైద్యుడు అభిప్రాయపడ్డారు.

పర్యావరణపరంగా తమ కశ్మీర్ చాలా సున్నితమైనదని ఇకపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలని మరొక కశ్మీరీ అభిప్రాయపడ్డారు.