రవితేజ-వినాయక్ సినిమా ఫిక్స్ !

చాన్నాళ్లుగా ఖాళీగా ఉన్నాడు వినాయక్. ఇతడితో సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ వినాయక్ వద్ద మాత్రం కథల్లేవు. ఇదే విషయాన్ని అతడు ఓపెన్ గా చెబుతుంటాడు కూడా. కథల్లేకుండా హీరోల్ని కలిసి ఏం చేయాలని రివర్స్ లో ప్రశ్నిస్తుంటాడు. బాలయ్యతో చేయాల్సిన సినిమా కూడా కథ సెట్ అవ్వకపోవడం వల్లనే ఆగిపోయిందని కూడా తెలిపాడు. ఇలా చాన్నాళ్లుగా ఖాళీగా ఉన్న వినాయక్ ఎట్టకేలకు ఓ కథ పట్టాడు.

అవును.. వినాయక్ దగ్గర ఇప్పుడొక కథ రెడీగా ఉంది. ఆ కథతో రవితేజ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. నల్లమలపు బుజ్జి అడ్వాన్స్ రవితేజ వద్ద ఎప్పట్నుంచో ఉంది. ఆ బ్యానర్ పైనే వినాయక్-మాస్ రాజా సినిమా పట్టాలపైకి వస్తుంది. అయితే దీనికి ఇంకా కాస్త టైమ్ ఉంది.

వినాయక్ ఇప్పుడు హీరోగా మారాడు. దిల్ రాజు బ్యానర్ లో నరసింహరావు దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. అదే టైమ్ లో అటు రవితేజ కూడా అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమా చేస్తాడు. ఇలా కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరు కలుస్తారు. కాబట్టి అఫీషియల్ స్టేట్ మెంట్ బయటకు రావడానికి చాలా టైమ్ పడుతుంది. గతంలో వినాయక్-రవితేజ కాంబినేషన్ లో కృష్ణ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.