బంగారు కమ్మలు మింగిన కోడి… ఆ తర్వాత…

తమిళనాడులో ఒక కోడి బంగారం మింగేసింది. దీంతో యజమాని లబోదిబోమన్నాడు. చివరకు ఆ బంగారం ఆ కోడి ప్రాణాలను కూడా తీసింది. చెన్నైలో నివాసం ఉంటున్న శివకుమార్‌ తనకు పిల్లలు లేకపోవడంతో ఇంట్లో ఒక కోడిని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా పూంజీ అని పేరు పెట్టుకున్నాడు.

అయితే శివకుమార్‌ భార్య స్నానం చేసిన తర్వాత తన బంగారు కమ్మలను తీసి పక్కన పెట్టింది. అక్కడికి వెళ్లి పూంజీ రెండు కమ్మలను గుట్టుక్కుమని మింగేసింది.

దాంతో శివకుమార్ కోడిని తీసుకుని అన్నానగర్‌ పశువైద్య శాలకు వెళ్లి జరిగింది చెప్పాడు. డాక్టర్‌ ఎక్స్‌రే తీసి కమ్మలు కడుపులో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. కానీ కోడి మాత్రం చచ్చిపోయింది. ఆపరేషన్ వికటించడం వల్ల కాదు… కమ్మ కొనభాగం పొట్టలో కుచ్చుకోవడం వల్లే కోడి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

అయితే బంగారు కమ్మలు తిరిగి వచ్చినప్పటికీ కోడి చనిపోవడంతో శివకుమార్‌ దంపతులు బోరున విలపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కోడి చనిపోయిందని ఆవేదన చెందారు. స్థానికులు వారిని ఓదార్చి… బాధపడకండి.. తామే మరో కోడి పిల్లను తెచ్చి ఇస్తామని చెప్పారు.