అవసరం ఉందని పవన్‌ భావించినన్ని రోజులూ పార్టీలో ఉంటా…

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనను వీడుతున్నారన్న ప్రచారం బాగా జరిగింది. జనసేనలో తనను పక్కన పెట్టడంతో నొచ్చుకున్న మాజీ జేడీ… బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి.

ఇటీవల జనసేన ప్రకటించిన కమిటీల్లో లక్ష్మీనారాయణకు చోటు దక్కకపోవడం, ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, జనసేనలో పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహరే చక్రం తిప్పుతుండడంతో… ఈ మాజీ జేడీ బీజేపీ వైపు వెళ్తున్నారన్న వార్తలొచ్చాయి. ఈ వార్తలపై లక్ష్మీనారాయణ ట్విట్టర్‌లో స్పందించారు.

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు చూసి షాక్‌కు గురయ్యానని చెప్పారు. తన గురించి ఇలాంటి వార్తలు రాసి సమయం వృథా చేసుకోవద్దని..దానికి బదులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జనసేనకు తన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్ భావించినన్ని రోజులూ తాను ఆ పార్టీలోనే ఉంటానని లక్ష్మీనారాయణ చెప్పారు.