డబ్బు కోసమే అనసూయ ఈ సినిమా చేసిందా?

కథనం.. అనసూయ నటించిన తాజా చిత్రం. ఈ సినిమాకు ముందు ఏకంగా 12 కథలు విన్నానని, కథనం నచ్చినంతగా మరో కథ తనకు నచ్చలేదని ఘనంగా చెప్పుకొచ్చింది అనసూయ.

అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం అనసూయ చెప్పింది అబద్ధం అనిపించకమానదు. కథనం సినిమా ఓ నాసిరకమైన స్టఫ్ తో తెరకెక్కింది. ఆ జానర్ లో వచ్చిన ఓ 4-5 సినిమాల్ని కలిపి వండివార్చారనే విషయం అర్థమౌతుంది. ఇలాంటి కథను అనసూయ ఎలా అంగీకరించిందో అర్థంకావడం లేదంటున్నారు నెటిజన్లు.

నిజానికి ఫుల్ లెంగ్త్ రోల్ కోసం అనసూయ చాన్నాళ్లుగా వెయిటింగ్. యాత్ర, రంగస్థలం లాంటి సినిమాల్లో ఆమె పాత్రలకు మంచి పేరు వచ్చినప్పటికీ.. కథ మొత్తం తన చుట్టూ తిరిగేలా, తనే లీడ్ రోల్ చేసే సినిమాల కోసం అనసూయ వెయిట్ చేసిందట.

అలాంటి సినిమాలేవీ ఆమె చెంతకు రాలేదు. ఎట్టకేలకు కథనం సినిమా రావడంతో, ఏదో ఒకటి అనే ఉద్దేశంతో ఆమె ఇందులో నటించడానికి ఒప్పుకుందట. అంతేకాదు, ఈ సినిమా కోసం ఆమె కాస్త భారీగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఇలా రొటీన్ కథతో చేసినప్పటికీ… రిలీజ్ కు ముందు కాస్త ప్రచారం కల్పించినట్టయితే కథనంకు ఓపెనింగ్స్ అయినా దక్కేవి. కానీ అనసూయ ఆ పని కూడా చేయలేదు. తన టీవీ కార్యక్రమాల కోసం కథనాన్ని బలిచేసింది.

కేవలం రిలీజ్ కు ముందురోజు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఫలితంగా నిర్మాతలకు కథనం సినిమా పీడ కలగా మారింది. ఇకనైనా అనసూయ సినిమాల విషయంలో కాస్త ప్లానింగ్ తో ఉంటే ఆమె కెరీర్ కు చాలా మంచిది. కథనం లాంటి సినిమా ఇంకోటి పడితే ఆ తర్వాత ఆమెకు క్యారెక్టర్ రోల్స్ కూడా రావు.