ఏపీకి 300 విద్యుత్ బస్సుల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం 300 విద్యుత్ బస్సులను కేటాయించింది. ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇన్‌ ఇండియా – ఫేమ్ 2 పథకం కింద దేశంలోని 64 నగరాలకు 5వేల 595 విద్యుత్ బస్సులను కేటాయించారు.

ఇందులో విశాఖకు వంద బస్సులు, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడకు 50 బస్సుల చొప్పున రానున్నాయి. ఒక్కో విద్యుత్ బస్సు ఖరీదు కోటి రూపాయలు కాగా.. కేంద్రం 40 శాతం రాయితీ ఇస్తోంది.

సాధారణంగా డిజిల్ బస్సు నిర్వాహణకు డ్రైవర్ జీతంతో కలిసి కిలోమీటర్‌కు 38 రూపాయలు ఖర్చు అవుతోంది. విద్యుత్ బస్సు వాడడం వల్ల కిలోమీటర్‌కు కేవలం 19 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు.

రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే దాదాపు 8 గంటల పాటు బస్సు ప్రయాణిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం 10వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది.