యాషెస్ సిరీస్ రెండోటెస్ట్ కు ఇంగ్లండ్ రెడీ

  • లార్డ్స్ టెస్ట్ జట్టులో ఆర్చర్, లీచ్ 
  • 5 మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్ర్రేలియా 1-0 ఆధిక్యం

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా…చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్ర్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్…రెండో టెస్ట్ కే హాట్ హాట్ గా మారింది.

 

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో ఘోరపరాజయం పొందిన ఆతిథ్య ఇంగ్లండ్.. రెండు మార్పులతో తుదిజట్టును ప్రకటించింది.

క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా బుధవారం ప్రారంభమయ్యే రెండోటెస్ట్ లో పాల్గొనే ఇంగ్లండ్ తుదిజట్టు నుంచి ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీని తప్పించి…స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్ బౌలర్ జాక్ లీచ్ కు చోటు కల్పించారు.

మోయిన్ ఫ్లాప్ షో…

బర్మింగ్ హామ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులిచ్చి 1 వికెట్టు, రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన మోయిన్ అలీ బ్యాటింగ్ లో సైతం దారుణంగా విఫలమయ్యాడు.

తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగిన మోయిన్ …రెండో ఇన్నింగ్స్ లో 4 పరుగులు మాత్రమే సాధించాడు. రెండుకు రెండుసార్లు కంగారూ ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ బౌలింగ్ లోనే మోయిన్ దొరికిపోయాడు.

ఆస్ట్ర్రేలియాతో ఆడిన గత 11 ఇన్నింగ్స్ లో లయన్ బౌలింగ్ లో మోయిన్ అలీ తొమ్మిదిసార్లు అవుట్ కావడం…ఇంగ్లండ్ టీమ్ మేనేజ్ మెంట్ ను గందరగోళానికి గురి చేసింది.

గాయంతో తొలిటెస్ట్ కు అందుబాటులో లేకుండాపోయిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్…రెండోటెస్టులో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది. 

జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టులో జేసన్ రాయ్, రోరీ బర్న్స్, జో డెన్లే, జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్,జాక్ లీచ్, సామ్ కరెన్ సభ్యులుగా ఉన్నారు.