Telugu Global
NEWS

జూరాల వద్ద.... హెచ్చరిక జారీ

జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతోంది. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు 57 గేట్లు ఎత్తివేశారు. 7 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం వైపుకు వదులుతున్నారు. ఇప్పటికే మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో జూరాల ప్రాజెక్టుకు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.561 మీటర్లు. ప్రస్తుతం […]

జూరాల వద్ద.... హెచ్చరిక జారీ
X

జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతోంది. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది.

ఇప్పటికే అధికారులు 57 గేట్లు ఎత్తివేశారు. 7 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం వైపుకు వదులుతున్నారు. ఇప్పటికే మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో జూరాల ప్రాజెక్టుకు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.561 మీటర్లు. ప్రస్తుతం నీటిమట్టం 315.80 మీటర్లుగా వుంది.

కాబట్టి ఇక వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదులుతున్నారు అధికార్లు. దీంతో శ్రీశైలం డ్యాం లోకి నీరు పెద్ద ఎత్తున చేరుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ వంటి చోట్ల నుండి, భీమా నది, తుంగభద్ర నదుల ద్వారా వచ్చే నీటితోనూ కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి.

నీరు పుష్కలంగా ఉండటం తో విద్యుత్ ఉత్పత్తి కూడా షురూ అయింది. కృష్ణా మీద ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకు ఉద్దేశించిన ప్రాజెక్టులు అన్నీ కూడా నీటి లభ్యతతో ఒక్కసారిగా బిజీ అయ్యాయి. కృష్ణా నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నెట్టెంపాడు, భీమ 1, భీమ 2, కల్వకుర్తి వంటి చోట్ల అధికారులు నీటిని పంపు చేసే పనిలో పడ్డారు.

మిషన్ భగీరథ కు తగినంత నీరు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో అధికారులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న తుంగభద్ర, భీమ, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

నదీతీర గ్రామాల ప్రజలు ఎవరూ నదిలోకి వేటకి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్ట్ అధికారులతోపాటు రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో కృష్ణమ్మ పరవళ్ళ ను చూడటానికి సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వారిని 150 మీటర్ల దూరంలోనే ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

2009 వరదల తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపు 7.5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరటం, ఇంకా నీరు వస్తూనే ఉండటంతో జిల్లా వాసుల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక ఖరీఫ్, రబీ పంటలు పండించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

First Published:  11 Aug 2019 11:50 AM GMT
Next Story