మరో సినిమా స్టార్ట్ చేసిన నాని

గ్యాంగ్ లీడర్ ఇంకా థియేటర్లలోకి రాలేదు. ఆ మూవీ ప్రచారం కూడా ఇంకా అధికారికంగా స్టార్ట్ కాలేదు. అంతలోనే ఆ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడు హీరో నాని. ప్రస్తుతం వేరే మూవీ సెట్స్ పైకి షిఫ్ట్ అయ్యాడు.

అవును.. దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో V అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఆ మూవీ సెట్స్ పైకి వచ్చేశాడు నాని. నాని తమ సినిమా స్టార్ట్ చేశాడనే విషయాన్ని దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు.

ఈ మధ్యంతా కాస్త కొత్తగా కనిపించాడు నాని. హెయిర్ బాగా పెంచాడు. గడ్డం కూడా దట్టంగా పెంచాడు. షూటింగ్ లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా కోసం నాని ఇలా మేకోవర్ అయ్యాడనే విషయం ఈరోజు బయటపడింది.

ఇది నాని సోలోగా నటిస్తున్న సినిమా కాదు. ఇంకా చెప్పాలంటే నాని ఇందులో హీరో కూడా కాదు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. సుధీర్ బాబు క్యారెక్టర్ నిడివే కాస్త ఎక్కువ. నాని రన్ టైమ్ కాస్త తక్కువ. నాని ఇందులో నెగెటివ్ షెడ్స్ లో కనిపించబోతున్నాడు. అందుకే ఇలా మీసాలు, గడ్డాలు పెంచాడు. అన్నట్టు నానికి ఇది అతడి కెరీర్ లో సిల్వర్ జూబ్లీ సినిమా.