ఒలింపిక్స్ హాకీ టెస్ట్ టోర్నీకి భారతజట్లు

  • టోక్యో చేరిన భారత పురుషుల, మహిళల జట్లు

టోక్యో ఒలింపిక్స్ హాకీ అర్హత పోటీల కోసం…భారత పురుషుల, మహిళల జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. 2020 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తున్న టోక్యో వేదికగా ఆగస్టు 17 నుంచి నిర్వహించే పురుషుల, మహిళల ఒలింపిక్స్ హాకీ టెస్ట్ టోర్నీలో పాల్గొనటానికి భారతజట్లు న్యూఢిల్లీ నుంచి జపాన్ కు బయలుదేరి వెళ్లాయి.

18 మంది సభ్యుల భారత పురుషుల జట్టుకు మిడ్ ఫీల్డర్ హర్మన్‌ ప్రీత్ సింగ్, మహిళల జట్టుకు రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తున్నారు.

నవంబర్ లో జరిగే ఒలింపిక్స్ అర్హత పోటీలకు సన్నాహకంగా ఈ పోటీలలో భారతజట్లు తలపడుతున్నాయి. పురుషుల విభాగంలో ఆతిథ్య జపాన్ తో పాటు న్యూజిలాండ్, మలేసియాజట్లతో భారత్ తలపడనుంది. మహిళల విభాగంలో చైనా, జపాన్, ఆస్ట్ర్రేలియా జట్లతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

గతంలో చైనా, జపాన్ జట్ల పై విజయాలు సాధించిన తమజట్టు… ప్రపంచ మేటి జట్టు ఆస్ట్ర్రేలియాపై నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉందని భారత మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ చెప్పింది.

కంగారూ జట్టుపై నెగ్గితే అది తమజట్టు ఆత్మస్థైర్యాన్ని గణనీయంగా పెంచగలదని రాణీ అభిప్రాయపడుతోంది. టెస్ట్ టోర్నీ పురుషుల ప్రారంభమ్యాచ్ లో మలేసియాతో , మహిళల విభాగంలో ఆతిథ్య జపాన్ తో భారతజట్లు తలపడనున్నాయి.