కేటీఆర్ ను ఇరుకునపెట్టిన రాములమ్మ….

రాములమ్మ పాయింట్ చూసి కొట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఇరుకునపెట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏదైతే అస్త్రంతో ప్రతిపక్షాలను దెబ్బకొట్టిందో అదే అస్త్రాన్ని బయటకు తీసి రాములమ్మ చెడుగుడు ఆడేయడం విశేషం.

తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశంలో బీజేపీ పోకడలపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. బీజేపీని సపోర్టు చేసిన వాళ్లు దేశభక్తులు అని.. సపోర్ట్ చేయని వారిని దేశద్రోహులంటూ రాజకీయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఇవే వ్యాఖ్యలను రాములమ్మ ఆయుధంగా మలుచుకున్నారు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ఇదే ఆయుధంతో ప్రతిపక్షాలను తుత్తునియలు చేసిందని.. టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయని వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్రవేయించిందని మండిపడింది. తమ దాకా వస్తే కానీ పరిస్థితి అర్థం కావడం లేదా అని కేటీఆర్ ను విజయశాంతి ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని ఎలాగైతే రాజకీయ మనుగడకు ఉపయోగించుకుందో బీజేపీ జాతీయవాదాన్ని వాడుకుంటోందని.. బీజేపీకి, టీఆర్ఎస్ కు పెద్ద తేడా లేదని మండిపడింది. ఇంతకాలం ప్రతిపక్షాలు బాధపడ్డాయని.. ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం మొసలికన్నీరు కారుస్తోందని విజయశాంతి దుయ్యబట్టింది. ఇప్పటికైనా తెలంగాణ ముసుగును టీఆర్ఎస్ తొలగించుకోవాలని విజయశాంతి హితవు పలికింది.