విజయసాయి హెచ్చరికలు…. బాబు టీం బీ అలెర్ట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ లో చెడుగుడు ఆడేశారు. ఏకంగా ఈసారి నలుగురు టీడీపీ ఉద్దండులను టార్గెట్ చేసి ఏకిపారేశారు. చంద్రబాబు, లోకేష్ తోపాటు కోడెల, దేవినేని ఉమాలపై విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

చంద్రబాబు ఇటీవల పాలిచ్చే ఆవును వదిలి దున్నపోతును తెచ్చుకున్నారని జగన్ గెలుపుపై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు.

పాలిచ్చే ఆవు చంద్రబాబు, పాలు మరవని దూడ లోకేష్ కలిసి ఆ ‘కోడెల’సంగతి చూడండి అంటూ బాబు, లోకేష్, కోడెలను ఏకిపారేశారు. ఐదేళ్లు కోడెలను అంబోతులా జనంపైకి వదిలారని.. ఇకనైనా దొడ్లో కట్టేయండని.. లేదంటే తరిమివేయండని వ్యాఖ్యానించారు. లేదంటే తామే గుంజలకు కట్టేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కోడెలను కాపాడి టీడీపీ వదిలేసినా.. వైసీపీ మాత్రం వదలదంటూ స్పష్టం చేశారు.

ఇక బాబును కడిగేశారు విజయసాయిరెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో గెలిచిన చోట రూపాయి కూడా ఇవ్వనంటూ చెప్పిన చరిత్ర మీదని.. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

ఇక దేవినేనిని వదల్లేదు విజయసాయిరెడ్డి. గత ప్రభుత్వంలో ఇసుక బకాసురులతో కలిసి ఒక్కొక్కరు నీతో కలిపి 100 కోట్లకు పైగా దోచుకున్నారని.. ఇప్పుడు వైసీపీ కొత్త పాలసీ తెస్తున్నందుకే నీకు బాధ అంటూ దుమ్మెత్తిపోశారు. ఇలా టీడీపీ నేతల కామెంట్స్ కు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.