ఏపీకి పట్టుదలతో పనిచేసే ముఖ్యమంత్రి దొరికారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుదలతో పనిచేసే ముఖ్యమంత్రి దొరికారని, అనుకున్నది సాధించే వరకూ వదలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కల్వకుంట్ల చంద్రశేఖర రావు కితాబునిచ్చారు.

తమిళనాడులోని కంచిలో దైవదర్శనానికి వెళుతూ మార్గమధ్యంలో చిత్తూరు జిల్లా నగరిలో కొంతసేపు ఆగారు కేసీఆర్. నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం అక్కడున్న విలేకరులు, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాలలోను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాలను తాను, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పథంలో నిలుపుతామని తెలంగాణ సీఎం అన్నారు.

గడచిన రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఏపీ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని తాను భావిస్తున్నానని చెప్పారు.

రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనపై కూడా ఉందని, ఇందుకోసం తనకు చేతనైన సాయం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.

“రాయలసీమను రతనాల సీమ చేస్తాను. ఇది కొందరికి అర్ధం కాకపోవచ్చు. జీర్ణం కూడా కాకపోవచ్చు. మరికొందరికి అజీర్తి చేయవచ్చు” అని ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని ఉద్దేశించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

చిత్తూరు జిల్లాకు గోదావరి జలాలు రావాల్సి ఉందని, ఆ నీళ్ళు వస్తే చిత్తూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆయన తెలిపారు.

లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, ఆ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ముఖ్యమంత్రిగా యువకుడు, పట్టుదల ఉన్న జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశాభావం వ్యక్తం చేశారు.