దిల్ రాజుకు కోపం తెప్పించిన దేవరకొండ

డియర్ కామ్రేడ్ విడుదలకు ముందు మాట. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు దిల్ రాజు చాలా ప్రయత్నించాడు. దేవరకొండ ఒప్పుకుంటే తనవద్ద ఉన్న ఆస్థాన దర్శకుల్లోంచి ఇద్దర్ని పంపి, కథ వినిపించాలనేది దిల్ రాజు ప్లాన్.

కానీ ఎందుకో దిల్ రాజు బ్యానర్ లో చేయడానికి దేవరకొండకు ఇష్టంలేదు. అందుకే ఈరోజు, రేపు అంటూ తప్పించుకుంటూ తిరిగాడు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో మరో సినిమాకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దిల్ రాజుకు కోపం తెప్పిస్తోంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటన వచ్చేసింది. అంతేకాదు.. పూరి-చార్మి-విజయ్ కలిసి ఓ సెల్ఫీ కూడా దిగి పోస్ట్ చేశారు. దీంతో దిల్ రాజుకు దేవరకొండపై కోపం వచ్చిందనేది ఇండస్ట్రీ టాక్.

నిజానికి డియర్ కామ్రేడ్ ఫెయిల్యూర్ తర్వాత దిల్ రాజు గూటికే దేవరకొండ చేరుతాడని అంతా అనుకున్నారు. అటు విజయ్ కూడా దాదాపు ఆ కాంపౌండ్ కే ఫిక్స్ అయ్యాడు. దిల్ రాజుతో ప్రాధమికంగా చర్చలు కూడా పూర్తయ్యాయి. 2-3 సార్లు దిల్ రాజు ఆఫీస్ లో దేవరకొండ తచ్చాడుతూ కనిపించాడు కూడా. దీంతో దిల్ రాజు-దేవరకొండ కాంబో ఫిక్స్ అనుకున్నారంతా.

సరిగ్గా టైమ్ చూసి పూరి జగన్నాధ్ తో సినిమాను ఎనౌన్స్ చేశాడు దేవరకొండ. మొన్నటివరకు తన ఆఫీస్ చుట్టూ తిరిగిన దేవరకొండ, ఇప్పుడు పూరికి కాల్షీట్లు ఇవ్వడాన్ని దిల్ రాజు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.