హిందు బాలిక అంత్యక్రియలు చేసిన ముస్లింలు

నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం వారణాసి లో చోటు చేసుకుంది. 19 ఏళ్ల హిందు యువతి అంత్యక్రియలను ముస్లింలు నిర్వహించి మతతత్వ వాదులకు ఓ మంచి మెసేజ్ ఇచ్చారు.

ఐ ఎ ఎన్ ఎస్ రిపోర్ట్ ప్రకారం… ఈ సంఘటన వారణాసి లోని హర్హువా దీహ్ ప్రాంతం లో జరిగింది. సోనీ అనే ఓ హిందు బాలిక మలేరియా వ్యాధితో పోరాడుతూ ఆదివారం రాత్రి చనిపోయింది.

ఆ అమ్మాయి తండ్రి హొరిలాల్ విశ్వకర్మ కొద్ది సంవత్సరాల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. తల్లి గుండె జబ్బు తో బాధపడుతూ ఉంది. సోని సోదరుడు ఒక్కడి సంపాదన మీదే ఆ కుటుంబం అంతా ఆధారపడి ఉంది.

ఈ పరిస్థితుల్లో సోని మరణించడం తో… చుట్టుపక్కల ఊన్న ముస్లిం సోదరులు ఆమె తండ్రి దగ్గరికి పోయి అంత్యక్రియల గురించి దిగులు పడొద్దని, అంతా తాము చూసుకుటామని ధైర్యం చెప్పారు.

కొందరు ముస్లింలు తల పై మతపరమైన టోపి ధరించి, అంత్య క్రియలకు ఏర్పాట్లు చేశారు. సోని పాడెని వారే మోస్తూ మణికర్ణిక ఘాట్ కి తీసుకుపోయారు. హిందు అంత్య క్రియలకు సంబంధించిన అన్ని పద్ధతులనూ వారు అనుసరించారు. హిందు ఆచారం ప్రకారం శవాన్ని తీసుకు వెళ్లేటప్పుడు “రాం నాం సత్య హై” అంటూ ముందుకు సాగారు.

సోని సొదరుడు అంత్యక్రియల్లో తన విధిని నిర్వహించడంలో సహాయం చేశారు. కొంత డబ్బు పోగుచేసి ఆ కుటుంబానికి ఇచ్చారు.

ఈ అంత్య క్రియల్లో పల్గొన్న షకీల్ మాట్లాడుతూ… “యెహీ సత్య్ హై(ఇది సత్యం). చివరికి జీవితం ఇంతే. కానీ చిన్న చిన్న విషయాలకే మనలో మనం తన్నుకుంటూ ఉంటాం” అని అన్నాడు. మానవత్వం మరచి మత కల్లోలాలకు, విద్వేషాలకు పాల్పడే వారికి అతడి మాటలు చెంప పెట్టు లాంటివి.