కశ్మీర్‌ గవర్నర్‌ ఛాలెంజ్‌కు…. సై అన్న రాహుల్ గాంధీ

కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. కశ్మీర్‌లో ప్రజలపై హింస జరుగుతోందని రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించారు.

ఇందుకు స్పందించిన సత్యపాల్ … తాను ప్రత్యేక విమానం పంపుతానని… రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ఇక్కడి పరిస్థితిని పరిశీలించుకోవాలని చాలెంజ్ చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాహుల్ గాంధీ బాధ్యతారాహితంగా మాట్లాడుతున్నారని సత్యపాల్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో తోటి కాంగ్రెస్ నేత మూర్ఖంగా చేసిన ప్రసంగానికి రాహుల్ గాంధీ సిగ్గుపడాలంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు.

సత్యపాల్ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో స్పందించిన రాహుల్ గాంధీ… తాము కశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్దమని చెప్పారు. తనతోపాటు ప్రతిపక్ష నేతల బృందం … గవర్నర్ ఆహ్వానం మేరకు పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

తమకేమీ ప్రత్యేక విమానం కూడా అక్కర్లేదన్నారు. స్వేచ్చగా అక్కడి ప్రజలను, కీలక నేతలను కలిసే అవకాశం కల్పిస్తే చాలని రాహుల్ కోరారు. ఇందుకు సత్యపాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రతిపక్ష నేతలను కశ్మీర్ పర్యటనకు ఆహ్వానిస్తారో లేదో చూడాలి.