వలసదారులకు ట్రంప్ భారీ షాక్

అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనుకునే వారికి ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డు జారీకి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అమెరికా తన పౌరులకు అందించే ఆహార, వైద్యసాయం, నివాస వోచర్లతో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను వలసదారులకు నిరాకరించేలా కొత్త నిబంధనను ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

గ్రీన్ కార్డు పొందాలనుకునే వారు తాము ప్రభుత్వ సాయంపై ఏమాత్రం ఆధారపడబోమని కాన్సూలేట్ ఆఫీసర్ ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు గ్రీన్ కార్డు పొందిన వారు అమెరికాలో శాశ్వత నివాసంతోపాటు ప్రభుత్వం అందించే ఇతర ప్రయోజనాలను అందుకునే అవకాశం ఉండేది.

వలసదారులకు కూడా సాయం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికమవుతోందని భావించిన ట్రంప్… ఇప్పుడు ఈ కొత్త నిబంధన తెచ్చారు. అమెరికాకు వచ్చే వారు వారి సొంత ఆదాయం మీద బతకాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదన్న ఉద్దేశంతోనే విదేశీ వలసదారులకు అందించే సాయాన్ని నిరాకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.