Telugu Global
National

మా ఉద్యోగాలు మాకే.. కన్నడ ఉద్యమం

2014కు ముందు తెలంగాణలో కేసీఆర్ ది అదే మాట…. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడైన ట్రంప్ నోటా ఇదే మాట…. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే ఉద్యమం.. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్న వలసవాదులను తరిమికొట్టే పద్మవ్యూహం. తమ ఉద్యోగాలు తమకే దక్కాలని నినదిస్తున్నారు. ఈ కొత్త ప్రాంతీయ భావజాలం పురుడు పోసుకోవడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న వలసలే దీనికి కారణం అని చెప్పకతప్పదు. ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. అమెరికా అయినా ముంబై అయినా విమానంలో […]

మా ఉద్యోగాలు మాకే.. కన్నడ ఉద్యమం
X

2014కు ముందు తెలంగాణలో కేసీఆర్ ది అదే మాట…. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడైన ట్రంప్ నోటా ఇదే మాట…. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే ఉద్యమం.. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్న వలసవాదులను తరిమికొట్టే పద్మవ్యూహం. తమ ఉద్యోగాలు తమకే దక్కాలని నినదిస్తున్నారు.

ఈ కొత్త ప్రాంతీయ భావజాలం పురుడు పోసుకోవడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న వలసలే దీనికి కారణం అని చెప్పకతప్పదు.

ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. అమెరికా అయినా ముంబై అయినా విమానంలో జర్రున వెళ్లిపోతాం.. వివిధ కంపెనీలు, పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.

అయితే స్థానికులను విస్మరించి టాలెంట్ ఉన్న వాళ్లు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా వారిని ఎంపిక చేసి వాళ్లకు లక్షల జీతాలిస్తున్నారు. ఇదే ఇప్పుడు సమస్యలు తెచ్చిపెడుతోంది. స్థానికంగా కంపెనీలు, పరిశ్రమలు ఏర్పడి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వని వైనం అక్కడి ప్రజలు, యువతలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. అది ఉద్యమ రూపం దాల్చుతోంది. దాన్ని పొలిటికల్ గా ఎదగాలనుకునే వారు క్యాష్ చేసుకొని ఉధృతంగా మార్చేస్తున్నారు.

కర్ణాటకలో ఇన్నాళ్లు పరాయి రాష్ట్రాల సినిమాలను ఆడనిచ్చేవారు కాదు.. ఇప్పుడు పరాయి రాష్ట్రాల వాళ్లకు ఉద్యోగాలు కూడా కట్ చేసే ఉద్యమానికి పురుడు పోసుకుంది. స్వయంగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ పోరులో తాజాగా భాగస్వామ్యం కావడం సంచలనంగా మారింది.

తాజాగా కర్నాటకలో ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని.. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కన్నడ హీరో ఉపేంద్ర పోరుబాట పట్టారు. ఈనెల 14, 15 తేదీల్లో యువతతో కలిసి బెంగళూరు గాంధీ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగబోతున్నట్టు ప్రకటించారు. పెద్ద ఎత్తున యువత కదిలి రావాలని పిలుపునిచ్చాడు.

బెంగళూరు సహా బళ్లారి ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల వారు ఉపాధి పొందుతున్నారు. బెంగళూరు లో విస్తరించిన ఐటీలో మెజార్టీ ఆంధ్రా ఇంజనీర్లు, దేశంలోని ఇతర రాష్ట్రాల వారు అధిక సంఖ్యలో ఉన్నారు.

ఇక కన్నడ పరిశ్రమల్లోనూ పక్కరాష్ట్రాల వారు ఉన్నారు. దీంతో వారి రాష్ట్రంలో వారికి ఉద్యోగాలు దక్కడం లేదు. అందుకే ప్రజలు, యువత రగిలిపోతున్నారు. ఇప్పుడు నేతలు, యాక్టర్లకు ఇదో ఉద్యమంగా రాజకీయంగా ఎదగేందుకు సోపానంగా మార్చుకుంటున్నారు.

First Published:  13 Aug 2019 4:13 AM GMT
Next Story