వనపర్తిలో మేక అరెస్ట్

హరితహారం మొక్కల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంటోంది. మొక్కలు సరిగా పెంచకపోతే అందుకు పంచాయతీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. దాంతో మొక్కలను కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వనపర్తిలో రోడ్డు పక్కన నాటిన మొక్కలకు మేకల బెడద అధికమైంది. ఒక మేక రోడ్డు పక్కన మొక్కలను మేస్తూ పంచాయతీ కార్యదర్శి కంట పడింది. దాంతో ఆగ్రహించిన పంచాయతీ కార్యదర్శి ఆ మేకను తీసుకెళ్లి ఆఫీస్‌ వద్ద కట్టేశారు. ఎన్నిసార్లు చెప్పినా మేకల యజమానులు వాటిని రోడ్డుపై వదిలేస్తున్నారని… అవి మొక్కలను తీనేస్తున్నాయని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా కట్టేసిన మేక మెడలో ఒక బోర్డును కూడా వేశారు.

వనపర్తిలో బోలయ్య ఇంటి నుంచి వెంకటరెడ్డి షెట్టర్ వరకు మొక్కలను మేశాను… నన్ను కట్టేశారు… విడిపించండి… ఆకలేస్తోంది… అంటూ రాసిన బోర్డును దాని మెడకు వేశారు.

అయితే నోరులేని, ఏమీ తెలియని మేకలను ఈ విషయంలో శిక్షించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూగజీవాలను ఇబ్బంది పెట్టడం కంటే వాటిని అలా రోడ్ల మీదకు వదిలిన యజమానులపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.