కేసీఆర్ మదిలో కొత్త పథకం… దానికోసం ఎదురుచూడండి…

అది సిరిసిల్ల నియోజకవర్గం.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన సొంత నియోజకవర్గం. అక్కడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ దశను మార్చే గొప్ప పథకాన్ని కేసీఆర్ త్వరలోనే ప్రవేశపెడుతున్నారని కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కేటీఆర్ మాట్లాడుతూ ‘త్వరలోనే కేసీఆర్ మదిలో పురుడుపోసుకున్న పథకం అమలు కాబోతోంది. అది అమలైతే ఆరోగ్య తెలంగాణ ఆవిష్కారం అవుతుంది. అందరూ దానికోసం ఎదురుచూడండి’ అంటూ కేటీఆర్ ఆసక్తి రేపారు.

తెలంగాణలో అందరికీ ఉచిత వైద్యం అందించడం ఆ పథకం ముఖ్యఉద్దేశం అని.. అదే కేటీఆర్ చెప్పారని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు సేకరించారు. ఇప్పుడు దాన్ని వెబ్ సైట్ లో పొందుపరిచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానిస్తారట.

ఇక తెలంగాణలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిలో ఏ ఆసుపత్రికి వెళ్లినా వారికి తక్షణ వైద్య సేవలందించేలా కేసీఆర్ ‘ఉచిత వైద్యం’ పథకానికి పురుడుపోస్తున్నట్టు సమాచారం.

ఇదే గనుక అమలైతే తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించబోతున్నట్టే. తెలంగాణ ప్రజల దశను మార్చే ఈ పథకంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలుగుతోంది.