ఇవాళ్టి నుంచి సైరా ప్రచారం షురూ

ఈరోజు వరకు సైరాపై నడిచిన ప్రచారం ఒకెత్తు. ఇవాళ్టి నుంచి ప్రారంభంకాబోతున్న ప్రమోషన్ మరో ఎత్తు. అవును.. ఈరోజు నుంచి సైరా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. అంతా ఊహించినట్టే ఓ మేకింగ్ వీడియోతో ఈ ప్రచారాన్ని భారీగా ప్రారంభించబోతున్నారు. సైరా సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియో రెడీ అయింది. ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల 45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు.

నిజానికి పంద్రాగస్ట్ కానుకగా రేపు ఈ వీడియోను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో వ్యూస్, ట్రెండింగ్స్ ను దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందే వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుందని నిర్ణయించి, ఈరోజు విడుదల చేస్తున్నారు. సినిమాలో భారీతనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు మూవీ మార్కెట్ ను మరింత పెంచడం కోసం ఈ మేకింగ్ వీడియోను ఉపయోగించుకుంటున్నారు.

మరోవైపు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ఏఏ ఫిలిమ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ కు చెందిన ఈ సంస్థ ద్వారా ఉత్తరాదిన సైరా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను భారీగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించడంతో, బాలీవుడ్ లో మంచి రీచ్ ఉంటుందని భావిస్తున్నారు.