అవమానం భరించలేక రిపోర్టర్ ఆత్మహత్యయత్నం

ఒక తెలుగు టీవీ న్యూస్ ఛానల్‌లో పని చేసే రిపోర్టర్‌ను సీఐ అవమానించాడని తెలుస్తోంది. దాంతో అతను తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. మల్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్ ఒక ఛానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తన ప్రాంతంలోని ఒక దుకాణంలో ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ గొడవకు శ్రీనివాసే కారణమంటూ బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ స్టేషన్‌కు పిలిచి రాత్రంతా కూర్చోబెట్టారు.

తనకు, ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పినా వినలేదు. దీంతో తర్వాత రోజు సమీపంలోని వాటర్ ట్యాంకుపైకి ఎక్కి పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అంతకు మునుపు వాట్సప్ ద్వారా తనకు జరిగిన అవమానం గురించి వీడియో షేర్ చేశాడు.

ట్యాంకుపైన శ్రీనివాస్ పరిస్థితిని గమనించి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వైఖరి వల్లే తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని భార్య లావణ్య వాపోయారు.

కాగా, ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. దుకాణంలో జరిగిన గొడవలో శ్రీనివాస్ పాత్ర ఉందని తెలియడంతోనే పిలిచి మాట్లాడామని.. కాని అతడిని అవమానించలేదని ఆయన స్పష్టం చేశారు.