నేటి నుంచి ఏపీలో గ్రామ స్వరాజ్యం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి గ్రామ స్వరాజ్యం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో వాలంటీర్ల వ్యవస్థను లాంచనంగా ప్రారంభిస్తారు.

విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాలంటీర్ల పనితీరుపై అధికారులు, 1500 మంది వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో 1, 93, 421 మంది వాలంటీర్లు, పట్టణ ప్రాంతాలలో 73,375 మంది వాలంటీర్లు ఆగస్టు 15 వ తేదీ నుంచి విధుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర ప్రధానంగా మారనున్నది.

ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు వంతున ప్రభుత్వం కేటాయించింది. ఫించన్లు, రేషన్ సరుకులు, అంగన్ వాడీ వర్కర్ల పనితీరు, ప్రభుత్వానికి చెందిన వివిధ పనులపై పర్యవేక్షణ వంటివి వాలంటీర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. గ్రామాలు, పట్టణాల్లో మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని తీసుకురావడమే లక్ష్యంగా వాలంటీర్లు పని చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఇలా ఎంపికైన వారందరికీ శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వాలంటీర్లు పని చేస్తారు. అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు వారధిలా పనిచేస్తారు.

పార్టీలకు అతీతంగా విద్యార్హతలు, పని తీరే ప్రామాణికంగా వాలంటీర్లను ఎంపిక చేశారు అధికారులు. తాము సూచించిన వారికి వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వలేదనే ఆగ్రహంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేయడమే వాలంటీర్ల ఎంపికలో పాటించిన పారదర్శకతకు నిదర్శనమని అంటున్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందించేందుకు వాలంటీర్లు చర్యలు తీసుకుంటారు. దీని వల్ల ఇన్నాళ్లూ రాష్ట్ర్రంలో రెచ్చిపోయిన దళారీల వ్యవస్థకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్ది ఫుల్ స్టాప్ పెట్టారని ప్రజలు అంటున్నారు.